కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ఎప్పటికి జరిగెను!

ఎన్నికలు సమీపిస్తున్నప్పుడల్లా ఉద్యోగాల భర్తీ గురించి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడం, అవి కార్యరూపాం దాల్చక పోవడం జరుగుతూనే ఉంది. ఎమ్యెల్సీ (గ్రాడ్యుయేట్లు) ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, హుజురాబాద్ ఉపఎన్నికల సమయాలలో ఆ విధంగా చేసిన ప్రకటనలు ఆ తర్వాత గాలిలో కలిసిపోయాయి. 
 
తాజాగా శాసనసభ సాక్షిగా 91 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో అదే శాసనసభలో ప్రభుత్వంలో రెండు లక్షల ఖాళీలు ఉన్నట్లు ఆయనే చెప్పారు. అదలా ఉంచితే, ఆ ఉద్యోగాలను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పక పోవడం గమనార్హం. ఈ ప్రకటనతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారా అనే అనుమానాలు అధికార పక్షంలోనే కలుగుతున్నాయి.  
 
న్యాయబద్దంగా ఆ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రయత్నం చేసినా త్వరితగతిన ప్రభుత్వ యంత్రాంగం కదిలితే కనీసం రెండేళ్లు పడుతుందని అధికార పర్గాలు చెబుతున్నాయి. రకరకాల ఉద్యోగాలు ఉన్నందున వాటన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.
దానితో ఈ ఉద్యోగాల భర్తీ పక్రియ ఒక కొలిక్కి వచ్చే సరికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోతే, ఆ తర్వాత ఎవ్వరు ఉంటారో, ఏమి చేస్తారో చూసుకోవచ్చనే ధోరణి కనిపిస్తున్నది.
నోటిఫికేషన్ కంటే ముందు శాఖల వారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్​ తయారు చేయడం, పరీక్ష కోసం సిలబస్ రూపొందించడం, ఎలాంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా నోటిఫికేషన్​ను సిద్ధం చేయడానికి చాల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. పైగా, నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తుకు కనీసం నెల నుంచి రెండు నెలల సమయమివ్వాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ప్రిపరేషన్ కు మూడు, నాలుగు నెలలు, పరీక్ష రాశాక ఫలితాలకు మరో రెండు, మూడు నెలలు, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు నెల రోజులు, ఇంటర్వ్యూకు/ఈవెంట్స్​ కు ఒకటి,  రెండు నెలలు పట్టే అవకాశముంది. ఈ తతంగమంతా వెంటవెంటనే నిర్వహించినా కనీసం ఏడాదిన్నర పడుతుందని, మధ్యలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే మరో ఆర్నెల్లు, ఏడాది పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత గతంలో టీఎస్​ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్​–2, గ్రూప్ –4 పోస్టుల భర్తీకి ఐదేండ్లు పట్టగా, టీఆర్టీలో కొన్ని పోస్టుల భర్తీ ఆరేండ్లయినా పూర్తి కాలేదు. ఉద్యోగాల భర్తీలో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కీలకమైంది. ఆయా డిపార్ట్​మెంట్లలో ఖాళీల వివరాలు ఇచ్చే టైంలో వీటన్నింటిని సిద్ధం చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
 ఆ తరువాత ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ రిక్రూట్​మెంట్ ఏజెన్సీకి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఖాళీల గుర్తింపు పూర్తి చేసినప్పటికీ.. రోస్టర్ పాయింట్లపై అన్ని డిపార్ట్​మెంట్లు కసరత్తు చేస్తున్నాయి. ఆ తరువాత రిక్రూట్ మెంట్ ఏజెన్సీకి అనుమతి ఇస్తారు.
 ఆ తరువాత జాబ్ నోటిఫికేషన్​ను బట్టి ప్రిపరేషన్​కు రెండు నెలల నుంచి 4 నెలల టైం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ తరువాత రిజల్ట్​కు మరికొంత సమయం తీసుకుంటారు. ఇలా ఒక్క నోటిఫికేషన్ పూర్తి చేయాలంటే కనీసం 5 నెలలు సమయం పడుతుందని పేర్కొంటున్నారు. ఇక కోర్టు కేసులు ఇతరత్రా ఏమైనా సమస్యలు ఎదురైతే మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.

గ్రూప్–1 నోటిఫికేషన్  పక్రియను పూర్తి చేసేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఆ తరువాత మెయిన్స్ రెండు పరీక్షలు నిర్వహించడం, వాటి ఫలితాలు,  ఆ తరువాత ఇంటర్వ్యూ వంటివి ఉంటాయని వివరిస్తున్నారు. 

గతంలో గ్రూప్–2 నోటిఫికేషన్​ ఇస్తే పక్రియ పూర్తి కావడానికి నాలుగేండ్లు పట్టింది. ముందుగా కొన్ని జాబ్స్​ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ అయిపోతే.. మిగతా వాటికి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు పెద్ద సమస్య ఉండకపోవచ్చు. ముందుగా పోలీస్, ఉపాధ్యాయ భర్తీలకు కసరత్తు చేసే అవకాశంఉంటుంది.

అయితే ఉద్యోగులు రిక్రూట్ అయితే వారికి జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ బడ్జెట్​లో ప్రత్యేకంగా నిధులేమి కేటాయించలేదు. దీంతో ఖాజానాపై భారం పడకుండా కొన్ని పోస్టులను రానున్న ఆర్థిక సంవ్సతరంలో భర్తీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. 

అందులో భాగంగానే నోటిఫికేషన్లు పూర్తిస్థాయిలో ఇవ్వకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక సాధారణంగానే ఒక్కో నోటిఫికేషన్​ మధ్య కొంత వ్యవధి ఉండేటట్లు కూడా చూసుకుంటారు. 

విద్యా హక్కు చట్టం ప్రకారంఉపాధ్యాయుల ఉద్యోగాలకు తప్పనిసరిగా టెట్ అర్హత కలిగి ఉండాలి. ఈ పరీక్షను ఆర్నెల్లకోసారి నిర్వహించాల్సి ఉండగా తెలంగాణలో ఐదేండ్లుగా నిర్వహించలేదు. రాష్ట్రం వచ్చాక 2016 మే 22న తొలిసారి టెట్ నిర్వహించగా 2017 జులై 23న రెండోసారి టెట్‌‌‌‌ పెట్టారు. ఆ తర్వాత టెట్​ ఆలోచనే మరిచిపోయారు. 

2017లో అర్హత సాధించని వాళ్లు 2,28,027 మంది ఉండగా, వీళ్లతో పాటు గత ఐదేండ్లలో మరో లక్షన్నర మందికి పైగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వాళ్లుంటారు. టెట్ నిర్వహించకపోవడంతో వీళ్లంతా ప్రైవేటు స్కూళ్లలో చదువు చెప్పేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. 

త్వరలో భర్తీ చేయనున్న టీచర్ పోస్టులకు పోటీపడాలంటే వీరంతా టెట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంది. అందువల్ల ముందుగా టెట్ నిర్వహించకుండా టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు.