ఉక్రెయిన్ నగర మేయరు  కిడ్నాప్ … అన్ని వైపులా నుండి బాంబులు 

దక్షిణ ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్‌ను రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్‌కీ, ఉక్రెయిన్ అధికారులు చెప్పారు.పది మంది రష్యా ఆక్రమణదారుల బృందం మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ పార్లమెంట్ ట్విట్టర్‌లో పేర్కొంది.
 
మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ శత్రువులకు సహకరించడానికి నిరాకరించడంతో అతన్ని కిడ్నాప్ చేశారని ఒక వీడియో సందేశంలో జెలెన్స్కీ చెప్పారు.మెలిటోపోల్ నగరాన్ని రష్యా సైనికులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
 
‘‘మెలిటోపోల్ మేయర్‌ని కిడ్నాప్ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిన నేరం… రష్యన్ ఆక్రమణదారుల చర్యలు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల మాదిరిగానే ఉన్నాయి” అంటూ  ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ హెడ్ కిరిల్లో టిమోషెంకో టెలిగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు
 
 రష్యా దండయాత్రకు ముందు మెలిటోపోల్‌లో కేవలం 1,50,000 మంది నివాసులు మాత్రమే ఉన్నారు. కాగా, ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధం శనివారం నాటికి 17వరోజుకు చేరుకుంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ దేశంలోని పలు కీలక నగరాలను ముట్టడించింది. రష్యా సైనిక దాడి ప్రారంభించినప్పటి నుంచి 2.5మిలియన్ల మంది ప్రజలు ఉక్రెయిన్ దేశం నుంచి పారిపోయారు.
 
ఉక్రెయిన్‌లోని కైవ్ శివార్లలోని ఇర్పిన్‌లో రష్యా బాంబు దాడి తర్వాత ఒక ఫ్యాక్టరీ,దుకాణం దగ్ధమయ్యాయి. రష్యా సైనికదళాలు ఉక్రెయిన్ రాజధాని నగరమైన కైవ్ కు సమీపంలో ఉన్నాయి. కైవ్ నగరంలో శనివారం రష్యా వేసిన బాంబు పేలుళ్లతో అట్టుడికింది. బాంబు పేలుళ్ల చప్పుళ్లతో కైవ్ నివాసితులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
 
బుచా, ఇర్పిన్. హోస్టోమెల్‌తో సహా కైవ్ వెలుపల ఉన్న ప్రాంతాల్లో రష్యా బాంబులతో దాడులు చేస్తోంది. రాజధాని కీవ్​ను ఆక్రమించుకునేందుకు వీలుగా సిటీకి చుట్టుపక్కల మరిన్ని దళాలను రష్యా మోహరిస్తున్నట్టు శాటిలైట్​ చిత్రాల ద్వారా తెలుస్తోంది. 
 
మరోవైపు ఇటీవల దాడులకు గురైన న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్లను పరిశీలిస్తామని, అందుకు టీమ్​ను ఉక్రెయిన్​కు పంపుతామని ఇంటర్నేషనల్​ ఆటమిక్​ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ప్రకటించింది. అయితే, ఎప్పుడు వచ్చేది మాత్రం చెప్పలేదు.  
 
 రష్యా దాడులు ఎంత తీవ్రం చేస్తే.. ఉక్రెయిన్ ప్రతిఘటన అంత ఎక్కువగా ఉంటున్నది. దీంతో మరింతగా విధ్వంసానికి దిగుతున్నది రష్యా. నిన్నమొన్నటి దాకా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం, రాజధాని కీవ్, రెండో పెద్ద సిటీ ఖార్కివ్‌‌ లాంటి ప్రధాన సిటీలపైనే దృష్టి పెట్టిన పుతిన్ ఆర్మీ.. ఇప్పుడు పశ్చిమ ప్రాంతంపైనా గురి పెట్టింది. 
 
అక్కడి మూడు ప్రధాన నగరాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఎయిర్​పోర్టులే టార్గెట్‌‌గా బాంబింగ్స్ చేస్తోంది. ఉక్రెయిన్ మిలటరీ ఇన్‌‌ఫ్రా బాగా దెబ్బతిన్నదని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్‌‌లో సురక్షితమైన ప్రాంతమంటూ ఏదీ లేకుండా పోయింది. 
 
రష్యా దాడుల్లో ఒక్క మరియుపోల్ లోనే ఇప్పటిదాకా  1,582 మందికి పైగా చనిపోయినట్లు ఆ సిటీ కౌన్సిల్ చెప్పింది.   తాను కూడా ఇద్దరు పిల్లల తండ్రినని, తామెలాంటి జీవాయుధాలను తయారు చేయట్లేదని జెలెన్​స్కీ స్పష్టం చేశారు. 
 
ఇండస్ట్రియల్​సిటీగా పేరున్న దినిప్రోపైనా రష్యా దళాలు దాడులతో విరుచుకుపడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే నగరంపై రష్యా సైనికులు ఎయిర్​స్ట్రైక్స్​ ప్రారంభించినట్టు స్థానికులు చెప్పారు. రష్యా దాడుల్లో చిన్న షూ ఫ్యాక్టరీ, కిండర్​గార్టెన్​ స్కూల్​, అపార్ట్​మెంట్​పై మిసైళ్లు పడ్డాయని పేర్కొన్నారు. 
 
దాడిలో ఓ వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది. సిటీలో ఓ రాకెట్​ ఫ్యాక్టరీ సహా పెద్దపెద్ద పరిశ్రమలున్నాయి. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం మొదలుపెట్టగానే సిటీ చుట్టూ ఉక్రెయిన్​ దళాలను భారీగా మోహరించారు. వంతెనలు, మెయిన్​ రోడ్లమీద బందోబస్తు పెంచారు. కొన్ని రోజులుగా వేరే దేశాలకు వలసెళ్లిపోయిన ప్రజలు.. దినిప్రో సిటీ మీదుగానే సరిహద్దు​ దాటారు. 
 
ఇలా ఉండగా, రష్యా దాడుల నేపథ్యంలో పరిశోధనల కోసం ల్యాబ్​లలో దాచిన ప్రమాదకర పాథోజెన్లను నాశనం చేయాల్సిందిగా ఉక్రెయిన్​కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) సూచించింది. దాడులు జరిగి ఆ సూక్ష్మ జీవులు వాతావరణంలోకి విడుదల కాకముందే ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కోరింది. అమెరికా, వెస్టర్న్​ దేశాల సాయంతో ఉక్రెయిన్​ జీవాయుధాలను తయారు చేస్తోందని రష్యా ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే.