నాలుగేళ్లలో ఆర్‌ఎస్‌ఎస్ కు కొత్తగా లక్ష మందికి పైగా యువత

దేశ వ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకలాపాలతో పెద్ద సంఖ్యలో యువత ఆకర్షితులవుతున్నారు.   2017 నుంచి 2021 మధ్య కాలంలో 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు లక్ష నుంచి 1.25 లక్షల మంది వరకు ఆ విధంగా ఈ సంస్థ కార్యకలాపాలలో చేరారు. రోజువారీ శాఖ కార్యక్రమాలకు హాజరవుతున్న వారిలో 61 శాతం మంది విద్యార్థులే ఉంటున్నారని చెప్పారు. 
 
 ఆర్‌ఎస్‌ఎస్   వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ‘ ఆర్‌ఎస్‌ఎస్ లో చేరండి ‘ ద్వారా సంఘ్‌లో చేరాలనే ఆకాంక్షను వారంతా వ్యక్తం చేశారని సంస్థ సర్ కార్యవాహ  దత్తాత్రేయ హోసబలే వెల్లడించారు. గుజరాత్ లోని కర్ణావతిలో శుక్రవారం ప్రారంభమైన సంస్థ మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఆయన వార్షిక నివేదికను సమర్పించారు. 
 
తొలుత సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తో కలసి భారత మాత చిత్రపటంకు పూలమాల సమర్పించడం ద్వారా సమావేశాలను లాంఛనంగా ప్రారంభించారు. గత రెండేళ్లలో కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ, 2020తో పోలిస్తే దేశంలో 98.6 శాతం  కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని వార్షిక  నివేదికలో తెలిపారు. 
 
సమావేశాలు ప్రారంభం కాగానే సహా సర్ కార్యవాహ  మన్మోహన్‌జీ వైద్య మీడియా సమావేశంలో నివేదిక వివరాలను తెలిపారు. వార్షిక నివేదికలో సప్తహిక్ మిలన్ (వారంవారీ సమావేశం) సంఖ్య కూడా పెరిగిందని,  రోజువారీ శాఖలలో 39 శాతం వ్యవసాయి స్వయంసేవకులు హాజరవుతున్నారని చెప్పారు.    ఆర్‌ఎస్‌ఎస్  కార్య దృక్కోణంలో, దేశంలో 6506 బ్లాక్‌లు (ఖండ్) ఉన్నాయి. వాటిలో 84 శాతం ఖండ్ లలో సంస్థ పనిచేస్తున్నది.

59,000 మండలాల్లో, దాదాపు 41 శాతం మండలాలో భౌతిక శాఖల రూపంలో సంఘ కార్యం జరుగుతున్నది. 2303 పట్టణ ప్రాంతాలలో 94 శాతం చోట్ల శాఖ పనులు జరుగుతున్నాయి .  అన్ని మండలాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూలై మధ్య మధ్యలో 104 చోట్ల సంఘ్ శిక్షా వర్గాలు (ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా శిబిరాలు) ఉంటాయని, ఒక్కో వర్గానికి సగటున 300 మంది ఉంటారని ఆయన వివరించారు.

కరోనా కాలంలో, సంఘ్  వాలంటీర్లు సమాజంతో కలిసి సేవా కార్యాన్ని (వారి స్వచ్ఛంద సేవలను) చురుకుగా అందించారని దత్తాత్రేయ తెలిపారు. మహమ్మారి మొదటి రోజు నుండి 5.50 లక్షల మంది స్వయంసేవకులు సేవా కార్యాన్ని ప్రారంభించారు. మఠాలు, దేవాలయాలు, గురుద్వారాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు సేవా కార్యానికి తరలి వచ్చిన ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం. ఇది మేల్కొన్న దేశానికి సంకేతం అని దత్తాత్రేయ వివరించారు.

సంఘ్‌లో కుటుంబ ప్రబోధన్ (కుటుంబ అవగాహన), గౌ-సంవర్ధన్ (ఆవుల పోషణ), గ్రామీణ వికాస్ (గ్రామీణాభివృద్ధి) కార్యక్రమాలు విశేషంగా కొనసాగుతున్నాయని చెబుతూ స్వయంసేవకులను సంఘ్ కార్యానికి ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశం ప్రారంభంలో, గత సంవత్సరం మరణించిన ప్రముఖులందరికీ నివాళులు అర్పించారు. వారిలో ప్రముఖులు భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్, సిసిఎస్  జనరల్ బిపిన్ రావత్, బాబాసాహెబ్ పురందరే,  రాహుల్ బజాజ్, పండిట్ బిర్జు మహారాజ్ , పి. శ్రీనివాస రామానుజాచార్య స్వామి కూడా ఉన్నారు.

మీడియా సమావేశంలో  అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్, సహ ప్రచార్ ప్రముఖ్ నరేంద్ర కుమార్, అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.