ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి 130 సీట్లు

నాలుగు రాష్ట్రాలలో బిజెపి తిరిగి గెలుపొందడం దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపుతున్నది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆనందోత్సవాలు చెలరేగుతున్నాయి. ఆ ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలలో కూడా పార్టీ బలం పెంచుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులోని బిజెపి నాయకులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసిన కర్ణాటకలో సహితం బిజెపి వర్గాలలో ఈ ఎన్నికలో ధీమా కలిగిస్తున్నాయి.  రాష్ట్రంలో ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి 130 సీట్లు ఖాయమని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.
 ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాలను మూటగట్టుకుందని ఇకనైనా ఆ పార్టీ తీరు మార్చుకుంటే మంచిదని రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో గెలుస్తామని ధీమాతో ఉన్న కాంగ్రెస్ నేతలకు హితవు  పలికారు. గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కాపలా కాసేందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పరుగులుతీ యడం చూస్తుంటే కాంగ్రెస్‌కు ఎలాంటి గతి పట్టిందో అర్ధమవుతోందని ఎద్దేవా చేశారు.
కాగా బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతామని ఆయన స్పష్టం చేశారు.  అయితే పార్టీ సిద్ధాంతాలపై మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచాల్సిందేని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహహరితంగా ఉన్నారని చెప్పారు.
కులమత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అజెండాతోనే రాష్ట్రంలోని బిజెపి  ప్రభుత్వం ముందుకువెళుతోందని బిజెపి అగ్రనేత చెప్పారు. ప్రధాని మోదీ విజన్‌తోనే దేశంలో బీజేపీ ముందుకు దూసుకుపోతోందని చెబుతూ భారత దేశ రాజకీయాలలో ఇక కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని స్పష్టం చేశారు.