ఎన్నో రికార్డులు తిరగరాస్తున్న యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఘన విజయం సాధించి పెట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఎన్నో సరికొత్త రికార్డ్డులు సృష్టిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అయిదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి అధికారం చేపట్టే మొదటి ముఖ్యమంత్రిగా యోగి రికార్డు సృష్టిస్తారు. ఆ రాష్ట్రంలో 1985 తర్వాత అధికారాన్ని తిరిగి నిలబెట్టుకున్న తొలి పార్టీ గా బిజెపి రికార్డు సృష్టిస్తుంది.

 గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు తిరిగి ఆ పదవిని చేపట్టినప్పటికీ వారు అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. యోగి మాత్రం అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంఎల్‌ఎగా పోటీ చేసి గెలిచి యుపి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం 15 ఏళ్లలో తొలిసారి అవుతుంది. 

అదే విధంగా నోయిడాలో పర్యటించి పదవిని నిలబెట్టుకునే నేతగా కూడా ఆయన నిలవనున్నారు. నోయిడాలో పర్యటించిన ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారనే నమ్మకం గతంలో బలంగా ఉండేది. 49 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ మొదట్లో గోరఖ్‌పూర్ మఠానికి పరిమితమై ఉండేవారు. ఆయన ‘ హిందూ హృదయ సామ్రాట్’ అని ఆయన మద్దతుదారులు అంటారు.

ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ ప్రాంతానికి చెందిన పంచుర్‌లో 1972 జూన్ 5న జన్మించిన ఆదిత్యనాథ్ 1990లో అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొనేందుకు ఇల్లు వదిలిపెట్టారు. గర్వాల్ యూనివర్శిటీనుంచి సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన అప్పటి బిజెపి నేత మహంత్ అవైద్యనాథ్ శిష్యరికంలో రాజకీయాల్లో ఎదిగారు.

తన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ మందిరానికి ప్రధాన అర్చకుడవుతారని అవైద్యనాథ్ ప్రకటించారు. అప్పటికి ఆదిత్యనాథ్ వయస్సు 22 ఏళ్లు. యూనివర్శిటీలో ఎబివిపి చురుగ్గా పని చేశారు.1998లో అవైద్యనాథ్ ఆశీస్సులతో ఆయన ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటికి ఆదిత్యనాథ్ వయసు 28 ఏళ్ల మాత్రమే.

అప్పటినుంచి 2017 మార్చిలో యుపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు అయిదు సార్లు ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2017లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవికి ఆదిత్యనాథ్‌ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.

అప్పటివరకు కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్ర పడిన ఆదిత్యనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకొంది. వీటిలో కొన్ని వివాదాస్పదం కాగా, మరికొన్ని ప్రజాదరణను తెచ్చిపెట్టాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పదవినుంచి తప్పిస్తారనే ప్రచారం బలంగా సాగింది. 

అయితే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా బిజెపి అగ్రనాయకత్వం ఆయనకు అండగా నిలవడమే కాకుండా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించడంతో ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఆయన నేతృత్వంలోనే బిజెపి ఎన్నికల ప్రచారం సాగింది. ప్రధాని మోదీతో పాటుగా అగ్రనేతలంతా ఆయనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. 

ఉత్తరప్రదేశ్‌కు వెలుపల కూడా ఆదిత్యనాథ్ ప్రత్యేక ఆకర్షణ సంపాదించారు. ఇప్పుడు బిజెపి అగ్రనేతల్లో ఒకరుగా నిలిచారు. ఇప్పడు మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపడితే వరసగా రెండోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన అయిదో నేత అవుతారు.

నేర రాజకీయాలకు పేరొందిన కీలకమైన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే శాంతిభద్రతల పరిరక్షణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి, నేరస్తులు ఉంటె జైలులో ఉండాలి లేదా రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి లేదా ఎన్కౌంటర్ కు గురికావాల్సిన అంటూ నిష్కర్షగా స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా నిలిచింది. 

మొదటిసారి ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం దృష్టి సారించడం, ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరచడం ద్వారా పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించడం ప్రారంభించింది. కరోనా మహమ్మారి సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు వలస కార్మికులు, ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న విద్యార్థుల పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించగా ఆయన ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. 

ఎన్నికల ఫలితాల గురించి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ  బీజేపీకి విజయం అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. యూపీలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించిందని పేర్కొంటూ  ప్రధాని మోదీ నాయకత‍్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిందని కితాబిచ్చారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండోసారి తమకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని చెబుతూ  యూపీలో ఎన్నికలు తొలిసారి ప్రశాంతంగా జరిగాయని ప‍్రశంసించారు. 

పార్టీలోని ప్రతీ ఒక్కరి కృషితోనే ఈ విజయం దక్కిందని చెబుతూ  ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశారని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు జరిగాయని ఆరోపించారు. కానీ, ప్రజలు అవేవీ పట్టించుకోకుండా బీజేపీకి విజయం అందించారని కొనియాడారు. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయని విమర్శలు గుప్పించారు. ప్రజల తీర్పుతో యూపీలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే యూపీని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని భరోసా వ్యక్తం చేశారు.