ఎన్నికల ఫలితాలతో తేరుగులేని బిజెపి, ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా దేశంలో కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండోసారి ఎన్నికై చరిత్ర సృష్టించడంతో బిజెపి వర్గాలు సంబరాలలో మునిగిపోయాయి. ఈ ఫలితాలు ఆ పార్టీ నేతలలో దూకుడును పెంచి, 2024  లోక్‌సభ   ఎన్నికల వరకు తిరుగులేకుండా ముందుకెళ్లడానికి ప్రోత్సాహం కల్గించగలవని భావిస్తున్నారు.
 
 యూపీ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్స్ అంటూ ముందునుండి   విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాజా ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని ఇప్పుడు సర్వత్రా భావిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే జులైలో  జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీ సునాయనంగా గెలుపొందే అవకాశం ఏర్పడింది. 
 
యుపిలో బిజెపి పరాజయం పొందితే, ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని కొద్దీ నెలలుగా హడావుడి చేస్తున్న పలు ప్రాంతీయ పార్టీలకు ఈ ఫలితాలు ఒక విధమైన షాక్ వంటివే అని చెప్పవచ్చు.  కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వమును గద్దె దించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఇప్పుడున్న బలం సరిపోదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి.
తాజా ఫలితాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన, డీఎంకే, టీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీల భవిష్యత్‌ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాయో చూడాలి.
ముఖ్యంగా బిజెపి బలహీనమైతే తామేమి కష్టపడకుండా తమ బలం పెంచుకోవచ్చని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ కు, ముఖ్యంగా ఆ పార్టీ నేత  రాహుల్ గాంధీకి ఈ ఫలితాలు తీవ్ర ఆశాభంగమే అని చెప్పవచ్చు. యుపిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ ఎటువంటి ప్రభావం చూపలేక పోయారు. ఆమె ప్రచారం చేసిన పంజాబ్, గోవాలలో కూడా ప్రభావం లేకపోయింది.
కాంగ్రెస్ చతికలబడటంతో ఇక తామే బిజెపికి ప్రత్యామ్న్యాయంఅని సంబర పడుతున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్ ను కాబోయే ప్రధానిగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక కారణాలతో పంజాబ్ లో ఘనవిజయం సాధించినా గోవా, ఉత్తరాఖండ్, యుపి లలో పోటీచేసినా ఎటువంటి ప్రభావం చూపలేక పోవడం గమనార్హం.
జాతీయ స్థాయిలో బిజెపికి అర్ధవంతమైన సవాల్ రాజకీయంగా లేదని ఈ ఫలితాలు నిరూపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సవాల్ చేసేరీతిలో ఏ పార్టీ, ఏ నాయకుడు లేదని వెల్లడైనది. పైగా, బిజెపి తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పట్టు  నిలుపుకోవడం ద్వారా బలమైన రాజకీయ సందేశం కూడా పంపినట్లయింది.
మందగించిన ఆర్ధిక వృద్ధి, పెరుగుతున్న నిరుద్యోగం, అదుపులేని ధరలు, సంవత్సరంకు పైగా జరిగిన రైతుల ఉద్యమాలు కారణంగా బిజెపి బలహీనమైనదని ఆశలు పెట్టుకున్న ప్రతిపక్షాలకు నిరాశ ఎదురైనది. బిజెపిని ఎదుర్కోవడానికి వారు లోతయిన ఆత్మవిమర్శ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
సాయంత్రం వరకు, యుపిలో బిజెపి 403 సీట్లలో 268, ఎస్ పి 130, కాంగ్రెస్ 2, బిఎస్ఫై 1 సీటులలో గెలుపొందాయి. 117 సీట్లున్న పంజాబ్ లో ఆప్ 92, కాంగ్రెస్ 18, అకాలీదళ్ 4, బిజెపి 2 సీట్లు గెల్చుకొన్నాయి. 70 సీట్లు గల ఉత్తరాఖండ్ లో బిజెపి 48, కాంగ్రెస్ 18, బీఎస్పీ 2 సీట్లు గెలుపొందాయి. 
 
మణిపూర్ లోని 60 సీట్లలో బిజెపి 36, ఎన్ పి పి 9, కాంగ్రెస్ 5 సీట్లు విజయం సాధించాయి. 40 సీట్లున్న గోవాలో బిజెపి 20, కాంగ్రెస్ 12, ఆప్ 3 సీట్లు గెలుచుకున్నాయి.