యుపి ఫలితాలతో కేసీఆర్ బేజార్… ఇక బిజెపి తెలంగాణ వైపే!

దేశంలో బిజెపి అంతు తేలుస్తానంటూ నిన్నటి వరకు బీరాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించడంతో బేజార్ అయిన్నట్లయింది. ఇక బిజెపి కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణ వైపు ద్రుష్టి సారిస్తుందని ఖంగారు బయలుదేరిన్నట్లయింది. సహజంగానే ఈ ఫలితాలు తెలంగాణ బీజేపీలో నూతన ఉత్సాహం కలిగిస్తుంది. 
 
గత కొంతకాలంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా యుపి ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాలవైపు దృష్టి సారిస్తానని ఇక్కడి బిజెపి నాయకులకు చెబుతూనే ఉన్నారు. 2023లో తెలంగాణాలో బిజెపి అధికారం చేపట్టాలనే స్పష్టమైన అభిలాషను హుజారాబాద్ ఉపఎన్నికల సమయంలో ఆయన వ్యక్తం చేశారు. ఆ దేశంలో ఇప్పటికే రాష్ట్ర బిజెపి నాయకత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 
 
కరీంనగర్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా పార్టీ కేంద్ర నాయకత్వం సంఘీభావం తెలిపిన తీరు ఈ రాష్ట్రం వారి ప్రాధాన్యత జాబితాలో ఉన్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో బిజెపిని రాజకీయ ప్రత్యామ్న్యాయంగా ప్రజలు గుర్తింపు పొందగలుగుతున్నది. దానితో వచ్చెడి ప్రభుత్వం తమదే అనే ఉత్సాహం బిజెపి కార్యకర్తలలో కలుగుతున్నది. 
 
ఇప్పటికే దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలలో టి ఆర్ ఎస్ కంచుకోటలను బద్దలు చేసి గెలుపొందడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో సహితం అధికార పక్షంకు దాదాపు సమానంగా సీట్లు తెచ్చుకోవడం ద్వారా బిజెపి తెలంగాణలో పెరుగుతున్న తన పట్టును వెల్లడి చేసింది. 
 
ఇక యుపి ఎన్నికల తర్వాత తెలంగాణాలో బిజెపి దూకుడు మరింతగా పెంచే అవకాశం ఉంది. అధికార పక్షంలో అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు ఇప్పటికే బిజెపి నాయకత్వంతో సంప్రదింపులుజరుపుతున్నారు . దానితో ఖంగారు పడిన కేసీఆర్ బిజెపి వ్యతిరేక ప్రచారం ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. 
 
ఏదో విధంగా అధికారం నిలబెట్టుకునేందుకు ప్రతిపక్షాలు  సిద్ధంగా లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. అందుకనే యువతలో నెలకొన్న అసంతృప్తిని తొలగించడమా కోసం 91 వేల  ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు హడావుడిగా ప్రకటించారు. గతంలో సహితం ఇటువంటి ప్రకటనలు చేసినా కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. 
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ చతికల పడడంతో తెలంగాణలో తామే ప్రత్యామ్న్యాయంగా భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వంకు తీవ్ర ఆశాభంగం అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనాయకత్వం కుమ్ములాటలతో వీధిన పడుతున్నది. ఎన్నికలు వచ్చేసరికి ఎవ్వరు పార్టీలో మిగులుతారో అన్నది సందేహాస్పదమే.
గతంలో యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందేనని.. బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ యుపి ఫలితాలు రాగానే 
 బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని, యూపీ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బల్డోజర్లతో తొక్కిచ్చేస్తామని స్పష్టం చేశారు. 
 
కాగా, యోగి సంక్షేమ పాలన చూసే ప్రజలు ఓటేశారని బండి సంజయ్‌ తెలిపారు. యూపీ, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత కనబర్చిందని చెబుతూ ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని చెప్పారు.
 
ఈ సందర్భంగా,  తెలంగాణలో ప్రజాసంక్షేమ పాలన రావాలని ఆకాంక్షించారని తెలిపారు. కేంద్రానికి టీఆర్ఎస్‌ ప్రభుత్వం సహకరించడం లేదని, కేంద్ర నిధులను వాడుకోవడం లేదని తప్పుబట్టారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని సంజయ్‌ జోస్యం చెప్పారు.