నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా… పంజాబ్ లో ఆప్

ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి హవా  స్పష్టంగా కనిపిస్తున్నది. పంజాబ్ లో మాత్రం ఆప్ అధికారంలోకి రాబోతున్నది. కాంగ్రెస్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. 
 
కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో 37 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలువబోతున్నది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బిజెపి మెజారిటీ మార్క్ ను దాటింది. ప్రధాన ప్రతిపక్షం సమాజవాద్ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఉత్తరాఖండ్, మణిపూర్ లలో కూడా బిజెపి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. గోవాలో మాత్రం అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి, మెజారిటీకి ఒకటి, రెండు సీట్లు తక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
ఉత్తర ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి యోగీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 263కి స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ 202ను దాటేసింది. దీంతో మరోసారి యోగీ సీఎం పీఠంపై కూర్చొబోతున్నారు. స్వాతంత్రం వచ్చాక యూపీకి ఒక సీఎం పూర్తిస్థాయి పదవి కాలం పూర్తి చేసుకున్నాక.. రెండోసారి ఎన్నిక కావడం ఇదే తొలిసారి కానుంది.
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పైనే అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో యూపీలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
 
1985 తర్వాత యూపీలో ఏ ముఖ్యమంత్రి మళ్లీ ఎన్నిక కాలేదు. 1985 తర్వాత వరుసగా రెండోసారి ఒకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నమాట. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ 269 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా నారయణ్ దత్ తివారీ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 309 సీట్లు గెలుచుకుని సీఎం పీఠం దక్కించుకుంది. ఇప్పుడు ఇలా వరుసగా రెండుసార్లు (2017, 2022) సీఎం కావడం యోగికే దక్కనున్నది. 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వరణాసి పార్లమెంటు నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మోదీ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల కంటే సమాజ్‌వాది పార్టీ ముందంజలో ఉంది. 2017 ఎన్నికలలో, వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో వచ్చే అన్ని స్థానాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి
 
కాగా, పంజాబ్ లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం చెందుతున్నది. ఆ పార్టీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటమి దిశగా పయనిస్తుండటంతో  రాజీనామా చేసేందుకు గురువారం చండీఘడ్ నగరంలోని తన అధికార నివాసానికి వచ్చారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ గురువారం మధ్యాహ్నం పంజాబ్ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ను కలిసి తన రాజీనామాను సమర్పించే అవకాశముందని చెబుతున్నారు. 
 
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటలేకపోయింది. ఉత్తరాఖండ్‌లో కొంత మెరుగ్గా ఉన్నా అధికారానికి చాలా దూరంలో నిలిచిపోయింది. పంజాబ్‌లో తమ హవాను కొనసాగించలేకపోయింది. 
 
అంతర్గత కుమ్ములాటలు, సిద్ధు, అమరీందర్‌ సింగ్‌ మధ్య ఏర్పడ్డ బేధాభిప్రాయాలు వెరసి ఆప్‌కు అవకాశానిచ్చేలా చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగి ప్రచారం చేసినా గతసారి వచ్చిన ఏడు సీట్లును కూడా ఈసారి దక్కించుకోలేపోతోంది. ఇటు గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, యుపిల్లో కూడా తనదైన మార్క్‌ను చూపించలేకపోయింది.