ఈవీఎం ట్యాంపరింగ్‌ అన్న ప్రశ్నే లేదు

ఈవీఎం ట్యాంపరింగ్‌ అన్న ప్రశ్నే లేదని ఎన్నికల ప్రధానాధికారి సుశీల్‌ చంద్ర స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సుశీల్‌ చంద్ర మాట్లాడుతూ… 2004 లో వీవీప్యాట్‌లను ప్రతీ పోలింగ్‌ బూత్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.
 
 పోలింగ్‌ అనంతరం ప్రతీ ఈవీఎంకు సీల్‌ వేస్తామని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రణాళికబద్ధంగా కౌంటింగ్‌ను నిర్వహిస్తారని తెలిపారు. కేవలం అనుమతి ఉన్న రాజకీయ పార్టీల ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిస్తారని చెప్పారు.

ఇక యూపీలో ఈవీ ట్యాంపరింగ్‌ ఆరోపణలపైనా సీఈసీ వివరణ ఇస్తూ స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి ఓట్లు వేసిన ఏ ఈవీఎంను బయటకు తీయలేరని స్పష్టం చేశారు. “కొన్ని పార్టీలు ప్రశ్నలు లేవనెత్తాయి. మేం ఇచ్చిన వివరణతో ఆ పార్టీల వాళ్లు సంతృప్తి చెందారు. వారణాసిలోని ఈవీఎంలపై లేవనెత్తిన ప్రశ్నలు శిక్షణ నిమిత్తం ఉద్దేశించినవి”. అని తెలిపారు. 

స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం శిక్షణ అవసరాల కోసం ఈవీఎంల తరలింపు గురించి రాజకీయ పార్టీలకు తెలియజేయకపోవడమే ఎడిఎం చేసిన పొరపాటని చెప్పారు. కాగా, ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ తొత్తు కాదని స్పష్టం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ సమానమే అని తెలిపారు.

ఒమిక్రాన్ వేవ్ కారణంగా ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించిన సమయంలో, ఈసీ ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. మొత్తం 5 రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు, అలాగే ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 2,270 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన్నట్లు వివరించారు.

“మీ అభ్యర్థిని తెలుసుకోండి” యాప్ ఎన్నికల సంఘం చేపట్టిన విజయవంతమైన ప్రయత్నం ని పేర్కొన్నారు. నేర నేపథ్యం ఉన్నవారు ఓటర్లకు తెలియాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. కాబట్టి, తాము ఈ యాప్‌ని సృష్టించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,900 మంది అభ్యర్థులలో 1,600 కంటే ఎక్కువ మంది నేర నేపథ్యం ఉన్నవాళ్లే అని సీఈసీ సుశీల్‌ చంద్ర తెలిపారు.

 
 జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న సలహా మంచిది కానీ, అందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సామర్థ్యం ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు.