నవాబ్ మాలిక్ ను తొలగించాలని బిజెపి నిరసన 

ఎన్‌సిపి మంత్రి నవాబ్ మాలిక్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ర్యాలీ నిర్వహించడంతో బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆజాద్‌ మైదాన్‌లో ‘నవాబ్‌ మాలిక్‌ హఠావో, దేశ్‌ బచావో’ నినాదంతో బీజేపీ కీలక నేతలతో కలిసి నిరసననుద్దేశించి ఆయన అంతకు ముందు ప్రసంగించారు.
 
 పోలీసు వ్యాన్‌లోకి వెళ్లే ముందు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఈ సందర్భంగా గుమిగూడిన భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తల వైపు చేతులు ఊపుతున్న దృశ్యాలు కనిపించాయి. తనను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

తనను ముంబైలోని ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. తాను స్టేషన్‌లో ఉన్న వీడియోను షేర్ చేశారు. ఇతర బిజెపి నాయకులు కూడా ఆయనతో ఉన్నారు. 
ఆజాద్ మైదాన్‌లో జరిగిన ర్యాలీ తర్వాత తనను, ఇతర బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు.

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షులు  చంద్రకాంత్ పాటిల్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ దారేకర్, మాజీ ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్, ఇంధన శాఖ మాజీ మంత్రి చంద్రశేఖర్ బవాన్‌కులే, నితేష్ రాణే, ఆశిష్ షెలార్, కిరీట్ సోమయ్య, మోహిత్ భారతీయ,  ప్రసాద్ లాడ్‌లు అరెస్టయిన ఇతర బీజేపీ నాయకులలో ఉన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఫిబ్రవరి చివరలో మాలిక్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి ఆయనను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మాలిక్‌కు రాజీనామా చేయాలని లేదా తొలగించాలని బిజెపి డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఫడ్నవీస్ డిమాండ్ చేయడంతో రాష్ట్ర అసెంబ్లీ బుధవారం కొద్దిసేపు వాయిదా పడింది.