ఇక, సమాప్త్ వాది పార్టీ అన్న బిజెపి, అఖిలేష్ ఈవీఎం ట్యాంపరింగ్‌ పల్లవి

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్‌ను ఓటమిని అంగీకరించాలని హితవు చెబుతూ మార్చి 10 న ఫలితాలు రాగానే  సమాజ్ వాదీ పార్టీ “సమాప్త్ వాది పార్టీ” అవుతుందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య జోస్యం చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయని గుర్తు చేశారు.  హిందీలో వరుస ట్వీట్లలో మౌర్య ఇలా అన్నారు: “సమాజ్‌వాదీ పార్టీ,అఖిలేష్ యాదవ్ జీ వాదనలు పతనమయ్యాయి. అంటే మార్చి 10న ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలు సమాజ్‌వాదీ పార్టీని ‘సమాప్త్ వాది పార్టీ’ (ఒక పార్టీ, ముగింపుకు వచ్చిన పార్టీ)గా చేస్తారు”.

“అఖిలేష్ యాదవ్ జీ, ఓట్ల లెక్కింపుకు ముందు ఓటమిని అంగీకరించండి. ఆకాశమంత అహంకారం నుండి నేలపైకి రండి. మీ మైండ్ సెట్ ప్రజలకు తెలుసు, మీ పార్టీ గూండాల గురించి వారికి బాగా తెలుసు. సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే గూండాయిజం, నేరాలు, అల్లర్లు, అవినీతి, అక్రమ దందాలు జరుగుతాయని వారికి తెలుసు” అని ఆయన సూచించారు.

మరో ట్వీట్‌లో, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్‌ల భవిష్యత్తు రానున్న 25 ఏళ్లపాటు అంధకారంలో ఉంటుందని మౌర్య స్పష్టం చేశారు. 

 
మరోవంక, ఎన్నికల ఫలితాలు రాక ముందే ఎన్నికల సంఘం అధికారులు కొందరు ఈవీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు   సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాత పల్లవిని అందుకున్నారు.  ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అఖిలేష్ ఈ ఆరోపణలు చేయడం మరింత ఆసక్తి రేపుతున్నాయి. 
 
వాస్తవానికి ఈసారి కూడా అధికారంలోకి రాదని ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు వెల్లడించడమే కారణం కావచ్చని పలువురు భావిస్తున్నారు. 
 
 ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ గెలుస్తుందనే ప్రేరణ కనిపిస్తోంది. అభ్యర్థులకు తెలియకుండా ఈవీఎంలను తరలిస్తున్నారు. స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారణాసి జిల్లా కలెక్టర్.. ఈవీఎంలను తరలించారు” అంటూ ఆరోపించారు.
“మన ఓట్లు మనం కాపాడుకోలేకపోతున్నాం. దీనిపైన ఈసీ దృష్టిపెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేను ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నాను’’ అని నిర్వేదం వ్యక్తం చేశారు.  ‘‘ఎవరికీ సమాచారం లేకుండా ఈవీఎంలను తరలించడం ఏంటి? ఇది దొంగతనం కిందే లెక్క. మా ఓట్లను కాపాడాలి. ఈ విషయమై మేము కోర్టుకు ఎక్కడానికి సిద్ధమే” అంటూ ఫలితాల పట్ల ఆత్మరక్షణలో పడినట్లు సంకేతం ఇచ్చారు.
కాగా, అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ గెలవబోతోంది. అందుకే అక్కడి ఈవీఎంలను మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో కొందరు ఎన్నికల అధికారులు కూడా ఉన్నారని విమర్శించారు. అయితే,  ఒకటి రెండు సర్వేలు మినహా దాదాపుగా అన్ని సర్వేలు బీజేపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చి చెప్పడం గమనార్హం.