నాటో సభ్యత్వంపై  జెలెన్‌స్కీ వెనుకడుగు… రష్యాతో శాంతికి సిద్ధం!

రెండు వారాలుగా రష్యా సేనలతో భీకరంగా యుద్ధం చేస్తున్నఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ  నాటో దేశాలు ఏవీ సైనికంగా మద్దతుగా నిలబడక పోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కనిపిస్తున్నది. అందుకనే ఇక తాను నాటో సభ్యతంకోసం వెంపరాడబోనని స్పష్టం చేశారు. అంతేకాదు, రష్యాతో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కాల్పుల విరమణకు నాటోలో  సభ్యంతం చేరబోమని స్పష్టమైన హామీని ప్రధాన షరతుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొండటం గమనార్హం. 
 
ఏబీసీ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. “చాలాకాలం తర్వాత విషయం ఏంటో నాకు అర్థం అయ్యింది. ఉక్రెయిన్‌ కోసం నాటో సిద్ధంగా లేదు. మిత్రపక్షాలు  వివాదాస్పద అంశాల జోలికి పోయేందుకు భయపడుతున్నాయి. ముఖ్యంగా రష్యాను ఎదుర్కొనేందుకు అవి సిద్ధంగా లేవు. ఇది గుర్తించడం కాస్త ఆలస్యమైంది” అంటూ పేర్కొన్నారు. 
 
“ఈ తరుణంలో నేనే చల్లబడడం మంచిది అనిపించింది. నాటో కోసం నేనింక బతిమాల దల్చుకోవడం లేదు. మోకాళ్లపై కూర్చుని అడుక్కుకోవాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్‌ కంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. ఈ దేశాన్ని(ఉక్రెయిన్‌ను) అలా చూడాలనుకోవడం లేదు. అలాంటి దేశానికి నేను అధ్యక్షుడిగా ఉండాలనుకోవడం లేదు’’ అంటూ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. 

అంతేకాదు రష్యా స్వతంత్య్ర రాజ్యాలుగా గుర్తించిన ఉక్రెయిన్‌ రెబల్స్‌ విషయంలోనూ రాజీ పడాలని నిర్ణయించుకున్నట్లు కూడా జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్‌లో భాగం కావాలనుకునే వ్యక్తులు అక్కడ ఎలా జీవిస్తారన్నది నాకు ముఖ్యం. రష్యన్ ఫెడరేషన్ పౌరులుగా తమను తాము చూసే వారి అభిప్రాయంపై నాకు ఆసక్తి ఉంది. అయితే, ఈ సమస్య గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకు నేను సిద్ధం’’ అంటూ ప్రకటించాడు. 

దీంతో రష్యాతో శాంతియుతంగా సమస్య పరిష్కారానికి జెలెన్‌స్కీ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు పంపినట్లయ్యింది. మరి రష్యా నుంచి బదులు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రష్యా ఆయిల్‌పై అమెరికా దిగుమతి ఆంక్షలు విధించింది. ఈ తరుణంలో అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న పుతిన్‌.. మరింత రెచ్చిపోతాడా? శాంతిస్తాడా?.. నేడు మూడో దఫా చర్చలపైనే(జరగొచ్చనే ఆశాభావం) ఆసక్తి నెలకొంది.

2008లో ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకోండి. ఈ విషయంపై అభ్యంతరాలతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యకు దిగాడు. ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున నాలుగు నుంచి ఏడు వేల మధ్య సైనికులు చనిపోయినట్లు అంచనా. అలాగే ఉక్రెయిన్‌ తరపు నుంచి నష్టంపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.

ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లిన 20 లక్షల శరణార్థులు

 రెండో ప్రపంచ యుద్ధం తరువాత నేలపై సాగుతున్న భారీ భీకర రష్యా యుద్ధంలో ముట్టడైన రెండు నగరాలను విడిచిపెట్టి శరణార్థులు మంగళవారం నుంచి భారీ ఎత్తున వలసలు ప్రారంభించారు. వలస జనం రద్దీతో కిక్కిరిసిన బస్సులు రక్షిత కారిడార్ల ద్వారా గమ్యానికి బయలు దేరాయి. 
 
ఇంతవరకు ఉక్రెయిన్ నుంచి 20 లక్షల వరకు శరణార్థులు వెళ్లినట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముట్టడైన నగరాల్లో ఆహారం, నీరు, మందులు అన్నిటికీ కరువై జనం అల్లాడిపోతున్నారు. ఉక్రెయిన్ లోని తూర్పునగరం సుమీ నుంచి మంచుతోదట్టంగా ఉండే రోడ్డు మీదుగా బస్సులు వెళ్తున్నాయని, అలాగే మరో దక్షిణ ముట్టడి రేవు పట్టణం మెరియుపోల్ నుంచి జనం కదిలివెళ్తున్నారని అధికారులు వివరించారు.
 
సుమీలో గ్రీన్ కారిడార్ కేటాయించడంతో తరలింపు మొదటి దశ ప్రారంభమైందని ఉక్రెయిన్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక్కడి నుంచి బస్సులు ఉక్రెయిన్ లోని ఇతర నగరాలకు వెళ్తుండగా, చాలా మంది దేశాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. 
 
ఉక్రెయిన్ ను విడిచిపెట్టి ఇప్పుడు 20 లక్షల మంది శరణార్థులు వలస పోగా, వారిలో లక్ష మంది ఉక్రెయినేతరులే ఉన్నారని ఐక్యరాజ్యసమితి లోని వలసల విభాగం అధికార ప్రతినిధి సఫా ఎంసెహ్లీ పేర్కొన్నారు.