సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు

ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన 694 మంది భారత విద్యార్థుల్ని తరలించినట్లు మంగళవారం కేంద్రం వెల్లడించింది. దీనితో యుద్ధం మధ్యలో చిక్కుకున్న భారతీయుల తరలింపులో చివరి గండం గడిచినట్లయింది.  సుమీలో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగానే వారిని బస్సుల్లో పోల్తావాకు తరలిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ వెల్లడించారు. 

అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నట్లు సమాచారం. ‘నిన్న రాత్రి కంట్రోల్‌ రూమ్‌తో మాట్లాడా. 694 మంది భారతీయ విద్యార్థులు సుమీలో ఉన్నారు. ఈ రోజు వారందరూ పోల్తావాకు బయలుదేరారు’ అని మీడియాకు తెలిపారు. సుమీ యూనివర్శిటీకి చెందిన ఒక విద్యార్థి కూడా  ఈ వార్తను ధృవీకరించారు. తమ కోసం  ఏర్పాటు చేసిన ప్రత్యేక  బస్సలు వచ్చాయని.. తామంతా పోల్తావాకు చేరుకోనున్నామని తెలిపారు.

తమ విజ్ఞప్తిని మన్నించిన రష్యా మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేసిందని, దీంతో సుమీలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా తరలిస్తున్నట్లు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ట్వీట్‌ చేశారు.  తీవ్రమైన చలిలో ఆహారం, నీరు తక్కువగా ఉన్నప్పటికీ, తాము 50 కి.మీ ప్రయాణించి రష్యా సరిహద్దుకు చేరుకునేందుకు యత్నిస్తున్నామని కొందరు విద్యార్థులు పెట్టిన పోస్టులు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, సుమీలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు తరలించేందుకు సహకరించాలని ఉక్రెయిన్‌, రష్యాలకు భారత్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. దీంతో పౌరుల తరలింపునకు రష్యా ముందుకొచ్చింది. సుమీ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు వెళ్లేందుకు మానవతా కారిడార్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం కాల్పులను తాత్కాలికంగా విరమించనున్నట్లు ప్రకటించింది. 

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30కి ఈ ఆపరేషన్‌ ప్రారంమైంది. ఈ కారిడార్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను రష్యాలోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసింది.