స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి మచ్చ

శాసనసభ బడ్జెట్ సమావేశాల నుండి బిజెపి ఎమ్యెల్యేలను బహిష్కరిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి మచ్చ అని బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు విమర్శించారు. ప్రతిపక్షాల గొంతునొక్కడం కరెక్ట్ కాదని అంటూ తమకు నిరసన తెలిపే హక్కుందని స్పష్టం చేశారు. 
 
సభలో కాంగ్రెస్ నేతలు కూడా నిరసన తెలిపి నినాదాలు చేశారని గుర్తు చేశారు. అయితే, తను, ఈటల రాజేందర్ సభలో నినాదాలు చేయలేదని పేర్కొన్నారు.  కావాలనే.. ముందస్తు ప్లాన్ ప్రకారమే బీజేపీ సభ్యులను సస్పెండ్ చేశారని రఘునందన్ ఆరోపించారు. రాజాసింగ్ నినాదాలు చేస్తుంటే..స్పీకర్ ఎందుకు హెచ్చరిక చేయలేదని ఆయన ప్రశ్నించారు.
సభకు అంతరాయం కలిగిస్తున్నారని స్పీకర్ ఒక్కసారైనా హెచ్చరించారా? అని నిలదీశారు.  సీఎం కనుసన్నల్లో సమావేశాలు నడుస్తున్నాయని పేర్కొంటూ కాగితం మీద కేసీఆర్ రాసి ఇవ్వగానే స్పీకర్ సస్పెండ్ నోట్ చదివారని ధ్వజమెత్తారు.

హైకోర్టునుకు బీజేపీ ఎమ్మెల్యేలు

రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. సస్పెన్షన్‌పై హైకోర్టులో మంగళవారం ఉదయం ఆ పార్టీ పిటిషన్‌ దాఖలు చేసింది. 

అలాగే సస్పెషన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాయకత్వంలో రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ  రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారన్నారు. హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని తెలిపారు.

సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని బీజేపీ నేతలు కోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని పేర్కొన్నారు. ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తన సొంత రాజ్యాంగాన్నిఅమలు చేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు ప్రతిపక్షాల గొంతు నొక్కేవిధంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. 
 
వెంటనే బిజెపి ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ కు రాజ్యాంగంపై గౌరవం లేదని, అందుకే లోగడ రాజ్యాంగాన్ని మార్చాలని నిరంకుశంగా వ్యాఖ్యానించారని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించకుండా కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.