25 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ)లో పేర్లు నమోదు చేసుకున్న 25 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఒక్కో నిరుద్యోగి బ్యాంకు ఖాతాలో వెంటనే రూ.1.20 లక్షల చొప్పున జమ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 
 
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం బీజేవైఎం మిలియన్‌ మార్చ్‌కు సిద్ధమైందన్న సమాచారంతో సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులు బుధవారం ఉదయం 10 గంటలకు టీవీ చూడాలంటూ ప్రకటన చేశారని పేర్కొన్నారు. నిరుద్యోగులను మభ్యపెట్టి, మోసం చేసే ప్రయత్నం చేస్తే వదలిపెట్టేదిలేదని హెచ్చరించారు. 
 
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ చూశాక కేసీఆర్‌కు కాషాయ సెగ తగిలిందని ఎద్దేవా చేశారు. 1.91 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్లపై సీఎం ప్రకటన చేసినా నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశా రు. ప్రపంచ గోల్‌మాల్‌ సంఘం అధ్యక్షుడు కేసీఆరే అని సంజయ్‌ ఎద్దేవా చేశారు. 
 
 కాగా,రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, గోవుల రవాణాను అడ్డుకున్న వారిపై కేసులను ఉపసంహరించుకోవాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కర్మన్‌ఘాట్‌లోని శ్రీ ధ్యానాంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 
 
 గత నెలలో ఆలయంలో గోరక్షక్‌లపై దుండగులు చేసిన దాడికి సంబంధించిన వివరాలను అడిగి  తెలుసుకున్నారు. తాము ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు కాపాడాలని కోరుకునే వాళ్లమని చెప్పారు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రే శాంతిభద్రతల సమస్యను తీసుకొస్తున్నారని ఆరోపించారు.