నన్ను ఎవరూ భయపెట్టలేరు. నేను దేనికీ భయపడను కూడా

‘నన్ను ఎవరూ భయపెట్టలేరు. నేను దేనికీ భయపడను కూడా’అని తెలంగాణ గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడిన ఘర్షణ వాతావరణం దృష్ట్యా మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు స్పష్టమైన రాజకీయం సందేశం పంపడం కోసమే అని పరిశీలకులు భావిస్తున్నారు. 
 
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగతం లేకుండానే ప్రారంభం అయ్యాయి. దీనిపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె వాఖ్యలకు ప్రాధాన్యత లభిస్తున్నది.
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలను గవర్నర్‌ సత్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాన హక్కుల కోసం మనమంతా ఒకవైపు డిమాండ్‌ చేస్తుంటే అన్ని స్థానాల్లో, చివరకు ఉన్నత పదవు ల్లోని మహిళలూ ఇంకా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
మహిళలు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నా రావాల్సిన గుర్తింపు రావట్లేదని, పైగా అవమానాలు ఎదురవుతున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు.  మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కట్లేదని, అత్యున్నత పదవుల్లోని వాళ్లూ గౌరవం పొందట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మహిళలు ప్రపంచవ్యాప్తంగా ప్రేమాభిమానాలు పంచుతూ శాంతియుత జీవనం కొనసాగేందుకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని గవర్నర్‌ గుర్తు చేశారు.
మహిళలు జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్నా ఆర్థిక స్వతంత్రం, ఆరోగ్యవంతంగా ప్రతీ క్షణం జీవితాన్ని ఆస్వాదించాలని ఆమె సూచించారు. మహిళా రక్షణ, లింగ సమానత్వంతో వారు పని చేసే వాతావరణం కల్పించాలని ఆమె కోరారు. మహిళలు సాధించిన అద్భుత విజయాలను గుర్తు చేసుకొని వారిని గుర్తించడం మహిళా దినోత్సవం ఉద్దేశమని ఆమె చెప్పారు.

కార్యక్రమంలో భాగంగా ‘ఈరోజు లింగ సమానత్వం – రేపటి సుస్థిర భవిష్యత్తు’అంశంపై సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీసుధ, జస్టిస్‌ రాధా రాణి, జస్టిస్‌ పి. మాధవీదేవి, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి, ఎమ్మెల్యే సీతక్కలు పాల్గొన్నారు. 

వారితో పాటు డాక్టర్‌ పద్మజారెడ్డి (కూచిపూడి), నోముల హేమలత (సామాజిక, వైద్య సేవ), ప్రీతి రెడ్డి, సాత్విక, జయలక్ష్మి, సీతామహాలక్ష్మి, మామిడి రచనను గవర్నర్‌ సత్కరించారు. ప్రొఫెసర్‌ అలేఖ్య పుంజాల బృందం కూచిపూడి బ్యాలెట్, గంగా జమునా బృందం మహిళా డప్పు వాయిద్య ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 300 మంది మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.   

మిథాలీ రాజ్ కు అభినందనలు 
 మిథాలీ రాజ్ కు తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. మిథాలీ రాజ్ 6 అంతర్జాతీయ ప్రపంచ కప్‌లు ఆడిన మొదటి మహిళా, మూడవ క్రికెటర్. బే ఓవల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మహిళల ప్రపంచకప్ ఓపెనర్‌లో మిథాలీ అద్భుతమైన ఫీట్ సాధించింది. ఈ ఘనత సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతూ డా. తమిళిసై సౌందరరాజన్ కూలో పోస్ట్ చేశారు.