10న రష్యా, ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రుల భేటీ

టర్కీ రిసార్ట్‌ అంటాల్యాలో ఈ నెల 10న రష్యా, ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నట్ల రష్యా మీడియా తెలిపింది. టర్కీ అధ్యక్షుడు తైపే ఎర్డోగన్‌ జోక్యంతో వీరిద్దరూ కలవడానికి అంగీకరించారు. టర్కీ సారధ్యంలో ఈ భేటీ జరుగనున్నది.
మరోవైపు ఉక్రెయిన్‌ నగరాల్లో రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. పోరాటానిు నిలుపుచేసి, ఉక్రెయిన్‌ తమ డిమాండ్లను ఆమోదిస్తేనే తమ సైనిక చర్య ఆపుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ టర్కీ అధ్యక్షుడుకు స్పష్టం చేశారు. రష్యా దాడులు కొనసాగుతునే వుండడంతో మరియుపోల్‌లో రెండోసారి కూడా పౌరుల తరలింపు నిలిచిపోయింది. 
 
కాగా, మానవతా కారిడార్ల ఏర్పాటుపై రష్యాతో చర్చలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్‌ సోమవారం తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై సోమ, మంగళవారాల్లో అంతర్జాతీయ న్యాయ స్థానం విచారణ చేపట్టింది. తక్షణమే రష్యా దాడులను నిలువరించేలా ఆదేశించాలని ఉక్రెయిన్‌ అభ్యర్ధించింది. దీనిపై సోమవారం ఉక్రెయిన్‌ తన వాదన వినిపిస్తుండగా, మంగళవారం రష్యా స్పందించనుంది.
 
ఉక్రెయిన్‌లో పౌరులను తరలించేందుకు రాజధాని కీవ్‌తో సహా నాలుగు నగరాల్లో రష్యా మరోసారి కాల్పుల విరమణను ప్రకటించింది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన మార్గాల ద్వారా కీవ్‌, ఖర్కోవ్‌, సుమీ, మరియు పోల్‌ల నుండి రష్యాకు వచ్చే పౌరులను అడ్డుకోవద్దంటూ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్‌ను కోరింది. 
 
ముందుగా కీవ్‌ నుండి బెలారస్‌కు వస్తే అక్కడ నుండి రష్యాకు వారిని విమానాల్లో తీసుకెళ్లాలన్నది మాస్కో ప్రణాళికగా వుంది. వేరే నగరాలకు వెళ్లాలనుకునేవారు రష్యా నుండి వెళ్ళవచ్చని చెబుతోంది. ఈ మేరకు రష్యా రెండోసారి కాల్పుల విరమణను ప్రకటించింది. కీవ్‌తో పాటు ఖర్కివ్‌, సుమీ, మరియుపోల్‌ నగరాలకు కాల్పుల నుండి కాస్త విరామం కల్పించింది. 
 
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30గంటలకు) రష్యా బలగాలు కాల్పులను విరమించాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమానియొల్‌ మాక్రాన్‌ విజ్ఞప్తి మేరకు మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.

ప్రధాన నగరాల నుండి పౌరులను తరలించేందుకు రష్యా చేసిన ప్రతిపాదనను అసంబద్ధమైనదని ఉక్రెయిన్‌ పేర్కొంది. ‘సురక్షిత మార్గాల’పై బాంబు దాడులు చేయడం ద్వారా గతంలో ప్రజల తరలింపును రష్యా అడ్డుకుందని ఉక్రెయిన్‌ డిప్యూటీ ప్రధాని ఇర్యానా వెరెష్చుక్‌ ఆరోపించారు.
 
 ”మానవతా కారిడార్లను తెరుస్తామని రష్యన్లు చెబుతున్నారు. కానీ ప్రజలందరూ రష్యా భూభాగంలోకి వెళ్ళిపోవాలనివారు కోరుకుంటునాురు. అది అసంబంద్ధమైన, ఆమోదయోగ్యం కానిప్రతిపాదన” అని వెరెష్చుక్‌ సోమవారం సోషల్‌మీడియాలో వ్యాఖ్యానించారు. కీవ్‌ నుండి బెలారస్‌కు తమ ప్రజలు వెళ్ళరని ఆయన విలేకర్లకు స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ వైపు నుండి వచ్చే శరణార్ధులకు ప్రత్నామ్నాయ మార్గాలను రష్యా ఆమోదించాలని కోరారు.
మరో వైపు మరియుపోల్‌లో పరిస్థితి ఆందోళనకరంగా వుంది. అజోవ్‌ సముద్ర తీర ప్రాంతమైన ఈ నగరాన్ని డాంటెస్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ (డిపిఆర్‌) బలగాలు చుట్టుముట్టాయి.  నగరంపై బాంబు దాడులు జరిపిందని ఉక్రెయిన్‌ విమర్శిస్తుండగా, ఉక్రెయిన్‌ జాతీయవాదులే ప్రజల తరలింపును అడ్డుకుంటున్నారని రష్యా విమర్శిస్తోంది
 
కీవ్‌, ఖర్కివ్‌ ఇతర ప్రాంతాల్లో నివాస ప్రాంతాలపై భారీగా బాంబు దాడులు జరిగాయని ఉక్రెయిన్‌ చెబుతోంది. తాము సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని, వైమానిక క్షేత్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు, రాడార్‌ స్టేషన్లపై దాడులు చేశామని రష్యా రక్షణ శాఖ పేర్కొంటోంది. కాగా ఇప్పటివరకు ఉక్రెయిన్‌ను వీడి 17లక్షల మంది పశ్చిమ దేశాలకు వెళ్ళిపోయారని ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రకటించింది.