2070 కల్లా కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్

పర్యావరణ సానుకూల  ప్రాజెక్టులను వేగిరపరచడం ద్వారా 2070 కల్లా భారత్‌ను కర్బన్ ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్రీన్ ఫైనాన్సింగ్‌కు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు.
”ఫైనాన్సింగ్ ఫర్ గ్రోత్ అండ్ యాస్పిరేషనల్ ఎకానమీ” అనే అంశంపై మంగళవారంనాడు జరిగిన వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని చెప్పారు. ఆ దిశగా పనులు వేగవంతం చేయడానికి పర్యావరణ హిత ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సూచించారు. 
 
స్టార్టప్‌లు అభివృద్ధి దిశగా దూసుకు వెళ్లాలంటే ఎంట్రప్రెన్యూర్ షిప్, ఇన్నొవేషన్ అనేవి చాలా కీలకమని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం, నూతన ఆవిష్కరణలకు కృషి చేయడం, కొత్త వాణిజ్య మార్గాలపై దృష్టి సారించడం అవసరమని ప్రధాని చెప్పారు. శీఘ్ర వృద్ధి కోసం 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ప్రధాని చెప్పారు. 
 
విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని వృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన పెట్టుబడులపై పన్నులు తగ్గించడం, ఎన్‌ఐఐఎఫ్, గిఫ్ట్ సిటీ, న్యూ డీఎఫ్ఐ‌లు వంటి సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఫైనాన్షియల్, ఎకనామిక్ గ్రోత్‌తు తాము ప్రయత్నించినట్టు పేర్కొన్నారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తిపై కూడా ప్రధాని ప్రశంసలు కురిపించారు. భారత్‌కు ఆర్థిక మంత్రి మహిళ కావడం, ప్రగతిశీలక బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టడం మనమంతా గర్వించే విషయమని పేర్కొన్నారు.

నారీశక్తికి సెల్యూట్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సెల్యూట్ చేస్తున్నామని, వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. మహిళలకు గౌరవం, అవకాశాల కల్పనకు చేస్తున్న కృషి కొనసాగుతుందని మంగళవారంనాడు వరుస ట్వీట్లలో ఆయన పేర్కొన్నారు. 
 
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను ముందువరుసలోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
 
”ఆర్థిక స్వావలంబన నుంచి సామాజిక భద్రత వరకు, నాణ్యమైన హెల్త్‌కేర్ నుంచి హౌసింగ్ వరకూ, విద్య నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేంత వరకూ మన నారీశక్తిని భారత అభివృద్ధి యాత్రలో అగ్రభాగాన నిలిపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత పట్టుదలతో ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకు వెళ్తాం” అని మోదీ పేర్కొన్నారు.
 
 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కచ్‌లోని ఉమన్ సెయింట్స్ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన సెమినార్‌ను ఉద్దేశించి సాయంత్రం 6 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కూడా ప్రధాని ప్రసంగించనున్నారు.  ఈ సెమినార్‌లో కేందర్ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, భారతీ ప్రవిణ్ పవార్, సాధ్వి రితంబర, మహో మండలేశ్వర్ కనకేశ్వరి దేవి తదితరులు పాల్గోనున్నారు.