యుద్ధం పేరుతో వంట నూనెల కుత్రిమ కొరత!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటనూనెలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు వంటనూనెలు సరఫరాకు ఎటువంటి ఇబ్బంది కలగకపోయినా, వంటనూనెల దిగుమతి ఆగిపోయిందని, తక్కువగా ఉన్నాయంటూ కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి, ధరలను పెంచి వేయడం రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా జరుగుతున్నది.

దానితో ఎపిలో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని సాకుగా చూపించి వ్యాపారులు నిత్యావసర సరుకుల రేట్లను భారీగా పెంచేస్తున్నారు.  అక్రమంగా నిత్యావసర వస్తువుల రేట్లను పెంచుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

 
 ఎవరైనా అధిక ధరలకు వంట నూనెలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రజల డిమాండ్‌ను కొందరు క్యాష్‌ చేసుకుంటూనే ఉన్నారు. పలు ప్రాంతాలలో  విజిలెన్స్‌ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.
దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో కొన్నిచోట్ల వ్యాపారస్తులు షాపులకు తాళాలు వేస్తున్నారు.  అసలు ధర కంటే ఎక్కువ రేటుకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సాకుగా చూపి, ఆయిల్‌ వ్యాపారస్తులు భారీగా నిల్వ చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. పలు చోట్ల అక్రమ నిల్వలను సీజ్ చేయడం, అధిక ధరలకు అమ్మడంపై కేసులు నమోదు చేయడం కూడా చేస్తున్నారు.