ఏపీలో సినిమా టికెట్ ధరల జీవో విడుదల

సినీ పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య ఘర్షణకు దారితీసిన సినిమా టికెట్ ధరలకు సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు జీవో  ను విడుదల చేసింది.  ఏపీలో సినిమా టికెట్ల రేట్లు నిర్ధారిస్తూ జీవో సోమవారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 

మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కారణంగా ఈ జీవో ఇవ్వడం ఆలస్యమైందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ జీవోలో థియేటర్ల నాలుగు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. టికెట్ ధర కనిష్టంగా రూ.20 ఉండగా, గరిష్టంగా రూ.250 లుగా నిర్ధారించారు. ఒక్కో థియేటర్ లో ప్రీమియం, నాన్ ప్రీమియం టికెట్లకు వెసులుబాటు ఇచ్చారు. 

ప్రతి థియేటర్ లొ నాన్ ప్రీమియంకు 25 శాతం సీట్లు కేటాయించాలని తెలిపింది. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా రూ 100 కోట్ల బడ్జెట్ దాటితే టికెట్ల ధర పెంచుకునే అవకాశం కల్పించింది. 

టికెట్ల ధ‌ర‌లను క‌నీసం 10 రోజులు పెంచుకునే వీలు క‌ల్పించింది. అయితే 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాల‌కు మాత్ర‌మే తాజా రేట్ల పెంపు వ‌ర్తిస్తుంద‌ని జీవోలో పేర్కొంది ఏపీ ప్ర‌భుత్వం. దీంతోపాటు రోజుకు ఐదు షోల్లో ఒక‌ చిన్న సినిమా వేయాల‌ని నిర్దేశించింది. 

తాజాగా జారీ చేసిన ఉత్త‌ర్వుల‌తో పాత‌ జీవో నంబ‌ర్ 35 ర‌ద్దైన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న రాధేశ్యామ్‌తోపాటు మిగిలిన చిత్రాల‌కు ఊర‌ట ల‌భించిన‌ట్టైంది.

కార్పొరేషన్లలో నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం రూ.40, ప్రీమియం రూ.60,  కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం రూ.70, ప్రీమియం రూ.100లుగా ఉంది.

మున్సిపల్ కార్పొరేషన్‌ లో నాన్ ఏసీ థియేటర్లలో రూ.60, రూ.40-ఏసీ థియేటర్లలో రూ.100, రూ.70-స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100-మల్టీప్లెక్స్ రూ.150రిక్లయినర్ రూ.250లుగా ఉంది.

మున్సిపాలిటీలో నాన్ ఏసీ థియేటర్లలో రూ.50, రూ.30- ఏసీ థియేటర్లలో రూ.80, రూ. 60- స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.80- మల్టీప్లెక్స్  రూ.125లుగా ఉంది.

నగర/గ్రామ పంచాయతీలో నాన్ ఏసీ థియేటర్లలో రూ.40, రూ.20- ఏసీ థియేటర్లలో రూ.70, రూ.50- స్పెషల్ థియేటర్లలో రూ.90, రూ.70- మల్టీప్లెక్స్ రూ.100లుగా ఉంది.

టికెట్‌ రేట్లను సవరించడంపై మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగు సినీ పరిశ‍్రమ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్‌ గారికి పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు’ అంటూ చిరంజీవి రాసుకొచ్చారు.