ప్రచార, ప్రసారమాధ్యమాలపై ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత 

నాలుగో స్తంభంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసారమాధ్యమాలపై ఉందని, ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారథిగా.. అటు సమస్యలను ఇటు, ఇక్కడి పరిష్కారాలను అటు చేరవేయడంలో పాత్రికేయులు పోషిస్తున్న, పోషించాల్సిన పాత్రను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.

ఆదివారం హైదరాబాద్ లో ‘ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తూ  ప్రచార, ప్రసార మాధ్యమాలపై ప్రజల్లోనూ ఎన్నో ఆశలు, అంచనాలు ఉంటాయని గుర్తు చేశారు.  చాలా విషయాలను తమకు అర్థమయ్యే రీతిలో పత్రికలు వివరిస్తాయనే ప్రజలు భావిస్తారని చెబుతూ, అందుకు అనుగుణంగా సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు పత్రికలు కీలక భూమిక పోషించాలని ఆయన సూచించారు.

నిజాలను నిక్కచ్చిగా, వాస్తవాలకు తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నదున్నట్లుగా చేరవేయడమే ఉత్తమ పాత్రికేయం అని చెప్పారు. సంపాదకీయాల ద్వారా తమ భావాలను జోడిస్తూ.. మిగిలిన వార్తలను యథావిధిగా అందించాల్సిన అవసరం ఉందని  తెలిపారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలన్న ఆయన వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని సూచించారు.

తాము ఈ సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.  మనం రాసే ఒక్కొక్క అక్షరం మన తోటి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని బేరీజు వేయగలగాలని కోరారు. అక్షరంపై సంపూర్ణ సాధికారత ఉన్నవారే జర్నలిజం రంగంలో ప్రత్యేకతను చాటుకుంటారని పేర్కొన్నారు. ఇందులో నాటి కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు మొదటి వరసలో నిలుస్తారని ఉపరాష్ట్రపతి చెప్పారు.

ఈ సందర్భంగా తెలుగు పాత్రికేయ చరిత్రలో వ్యాసరచనకు నూతన ఒరవడి ప్రవేశపెట్టిన ముట్నూరి కృష్ణారావుకి ఉపరాష్ట్రపతి ఘనంగా నివాళులు అర్పించారు. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమని, మనిషి జీవిత విధానాన్ని, ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టగల శక్తి పత్రికలకు ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు.

అయితే ఈ శక్తిని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా పత్రికలకు ఉండాలని చెప్పారు. వివక్షలకు వ్యతిరేకంగా, మనవైన సంప్రదాయాలను, ప్రకృతిని కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తూ కృష్ణారావు గారు రాసిన సంపాదకీయాలు నేటికీ స్ఫూర్తిని పంచుతాయని చెప్పారు.