
ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అంటూ రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం తిరస్కరించిందని చెప్పారు.
వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ మాత్రమేనని, కేసీఆర్ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారని ధ్వజమెత్తారు. వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు.
రైతులు, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలం పోరాటం చేస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. కేసీఆర్కు కేటీఆర్తో పాటు మరో ఇద్దరు కొడుకులు ఉన్నారని, వారు అసదుద్దీన్ , అక్బరుద్దీన్లు అని ఎద్దేవా చేశారు. దేశంతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ ఖతం అయిందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ సీటును బీజేపీ గెలుస్తుందని, ఒవైసీని ఇంట్లో కూర్చోపెడ్తామని చెప్పారు. ‘‘కేసీఆర్ తనకు తాను సింహం అనుకుంటడు. బీజేపీకి ఆయన ఎలుకతో సమానం. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు’’ అని పేర్కొన్నారు.
‘‘ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బీజేపీ గల్లా పట్టి గుంజితేనే బయటకు వచ్చిండు. జైలుకు పోతానన్న భయంతోనే దేశంలో పర్యటిస్తుండు. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్కు ఇంటి పోరు ఎక్కువైంది” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.
బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేసి తీరుతామని సంజయ్ ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని, లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్లు నిర్మించుకోవడానికి బడ్జెట్లో నిధులు కేటాయించుకోవాలని హితవు చెప్పారు.
పాతబస్తీలో గణేశ్ నిమజ్జనం కార్యక్రమానికి కేసీఆర్, అసదుద్దీన్ ఎందుకు హాజరుకావటం లేదని ప్రశ్నించారు. యూపీలో నిర్మిస్తున్న రామ మందిరం మాదిరిగానే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని నిర్మిస్తామని చెప్పారు.
More Stories
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి