76 విమానాల్లో భారత్ కు చేరిన 15,920 మంది

ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వేలాదిమంది స్వదేశానికి చేరుకొంటున్నారు. ఆ దేశంలోని వేర్వేరు నగరాలల్లో ఉన్న వారు సరిహద్దులకు చేరుకుంటే.. అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల ద్వారా భారత్ కు తీసుకొస్తోంది. 
 
ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 76 విమానాల్లో 15,920 మందిని భారత్ కు తీసుకొచ్చినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఎన్నెన్ని విమానాలలో ఎంత మందిని భారత్ కు తీసుకొచ్చామన్నది వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 
 
రొమేనియా నుంచి 31 విమానాలలో 6,680 మందిని, పోలాండ్ నుంచి 13 విమానాలలో  2,822 మందిని, హంగేరి నుంచి 26 విమానాలలో 5,300 మందిని, స్లొవేకియా నుంచి 6 విమానాల్లో 1,118 మందిని భారత్ కు  చేర్చామని ఆయన వివరించారు.
 
ఆదివారం 11 ప్రత్యేక విమానాల్లో 2,135 మంది భారత పౌరులను ఉక్రెయిన్‌ నుంచి తిరిగి తీసుకువచ్చారు. మొత్తం మీద ఫిబ్రవరి 22 నుండి 66 ప్రత్యేక పౌర విమానాల్లో ఎయిర్‌లిఫ్ట్‌ చేయబడిన భారతీయుల సంఖ్య 13,852 కి చేరుకుంది. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఆదివారం మూడు ప్రత్యేక విమానాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 214 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపి (109), తెలంగాణ(105) మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.

ఇప్పటి వరకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఎఎఫ్‌) 10 సోర్టీల ద్వారా ఆయా దేశాలకు 26 టన్నుల రిలీఫ్‌ లోడ్‌ను తీసుకెళ్లి, 2056 మంది ప్రయాణికులను వెనక్కి తీసుకొచ్చారు.  సోమవారం బుడాపెస్ట్‌ (5), సుసెవా (2), బుకారెస్ట్‌ (1) నుండి 1,500 మందికి పైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి 8 ప్రత్యేక విమానాలు రానున్నాయి. 

కాగా, ఉక్రెయిన్ లో ఇంకా చిక్కుకుని ఉన్న వారిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ఆదివారం భారత ప్రభుత్వం తాజాగా మరోసారి అలెర్ట్ జారీ చేసింది. తక్షణం అక్కడ ఉన్న భారతీయులు అంతా తమ వివరాలతో ఒక గూగుల్ ఫారం  నింపాలని సూచిస్తూ ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. 
 
ఉక్రెయిన్ లో ఉన్నవ్యక్తి పేరు, వయసు, మెయిల్ ఐడీ, పాస్ పోర్ట్ నంబర్, ఉక్రెయిన్ లో వారు ఉన్న సిటీ పేరు, ప్రస్తుతం ఉన్న లొకేషన్, ఉక్రెయిన్ లో వాడుతున్న ఫోన్ నంబర్, భారత్ లో వారికి సంబంధించిన వ్యక్తి ఫోన్ నంబర్, ఇంకా ఆ వ్యక్తితో ఒకే చోట ఎక్కువ మంది ఉంటే వారి సంఖ్యను గూగుల్ ఫామ్ లో పొందుపరచాలని పేర్కొంది. ఈ వివరాల ఆధారంగా వారిని గుర్తించి స్వదేశానికి తీసుకురానున్నట్లు ఎంబసీ తెలిపింది.
 
బులెట్ గాయానికి గురైన విద్యార్థి నేడే 
 
ఉక్రెయిన్ యుద్ధ కల్లోలం నుంచి  బయటపడే ప్రయత్నంలో బుల్లెట్ గాయాలపాలైన భారత హర్జోత్ సింగ్ ను రేపు స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కీవ్ నుంచి ఉక్రెయిన్ సరిహద్దు వైపు ప్రయాణిస్తుండగా అతడిపై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్ గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనలో అతడికి బుల్లెట్ గాయాలతో పాటు ఫ్యాక్చర్స్ కూడా అయినట్లు హర్జోత్ వీడియో ద్వారా తెలిపాడు. ఇప్పుడు అతడిని సురక్షితంగా  స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలాండ్ లో ఉన్న కేంద్ర  కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ చెప్పారు. 
 
హర్జోత్ సింగ్ పై కాల్పులు జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు కంగారులో తన పాస్ పోర్ట్ ను పోగొట్టుకున్నాడని, అయితే అతడికి అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తి చేసి సోమవారం తమతో పాటు భారత్ కుక్ తీసుకొస్తున్నామని వెల్లడించారు. అతడు స్వస్థలానికి చేరుకున్నాక తల్లిదండ్రుల సంరక్షణ, ఇంటి ఆహారంతో  త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.