జాతీయ విద్యా విధానం అమ‌లుకి విద్యా భార‌తి కృషి

ప్ర‌పంచంలోనే భార‌త్ కేంద్రిత విద్య ను సాకారం చేసేందుకు జాతీయ విద్యా విధానం కీల‌కం అని విద్యా భార‌తి అఖిల భార‌త అధ్య‌క్షులు దూసి రామ‌కృష్ణారావు తెలిపారు. అందుచేత‌నే జాతీయ విద్యా విధానం అమ‌లుకి విద్యా భార‌తి ఎన‌లేని కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ఏడు ద‌శాబ్దాల పాటు విద్యా రంగంలో ఉన్న అనుభ‌వాన్ని ఇందుకోసం వినియోగిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

విద్యా బార‌తికి అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 కు పైగా పాఠ‌శాల‌లు న‌డుస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా సుమారు పాతిక వేల‌కు పైగా విద్యాల‌యాల‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం తీసుకోకుండా,  సేవ భావంతో ఇన్ని వేల విద్యాల‌యాలు నిర్వ‌హిస్తున్న అతి పెద్ద విద్యా వ్య‌వ‌స్థ గా ప్ర‌పంచంలోనే విద్యాభార‌తి రికార్డు సృష్టించింది. 

 
ఇదే ఒర‌వ‌డితో దేశ‌వ్యాప్తంగా విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందించేందుకు విద్యా భార‌తి వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుంటుంది. ఈ ప‌నుల‌ను స‌మీక్షించుకొనేందుకు విద్యా భార‌తి ద‌క్షిణ మ‌ధ్య క్షేత్రం (క‌ర్నాట‌క‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్) స‌మావేశాలు హైద‌రాబాద్ లో నిర్వ‌హించింది.

రెండు రోజుల పాటు జ‌రిగిన క్షేత్రీయ స‌మావేశాలకు హైద‌రాబాద్ బండ్ల‌గూడా జాగీర్ లోని శార‌దాధామం వేదిక‌గా నిలిచింది. విద్యా భార‌తి అఖిల భార‌తీయ కార్య‌ద‌ర్శి అవినీష్ భ‌ట్నాగ‌ర్, అఖిల భార‌తీయ ప్ర‌చార ప్ర‌భారీ, క్షేత్ర సంఘ‌ట‌న కార్య‌ద‌ర్శి లింగం సుధాక‌ర్ రెడ్డి ఈ కార్యక్ర‌మాల‌ను ప్రారంభించారు. 

 
క‌ర్నాట‌క‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌కు చెందిన 100కు పైగా ప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అయ్యారు. నిర్ణీత బిందువుల ఆధారంగా మూడు రాష్ట్రాల్లో విద్యా భార‌తి చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను స‌మీక్షించారు. రెండు రోజుల పాటు జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో రాబోయే కాలంలో నిర్వ‌హించాల్సిన కార్య‌క్ర‌మాలను నిర్దేశించుకొన్నారు.

ముగింపు కార్య‌క్ర‌మానికి జాతీయ అధ్య‌క్షులు దూసి రామ‌కృష్ణారావు, క్షేత్ర అద్య‌క్షులు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్ట‌ర్ చామ‌ర్తి ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విచ్చేసి మార్గ‌ద‌ర్శ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా జాతీయ విద్యా విధానం మీద ప్ర‌త్యేకంగా చ‌ర్చ చేప‌ట్టారు.  దేశ వ్యాప్తంగా జాతీయ విద్యా విధానం అమ‌లుకి విద్యా భార‌తి కార్య‌క‌ర్త‌లు కృషి చేస్తున్న‌ట్లు రామ‌కృష్ణారావు పేర్కొన్నారు. 

 
ఇప్ప‌టికే కొన్ని అంశాల్లో జాతీయ విద్యా విధానం ఆధారంగా విద్యా భార‌తి కార్యాచ‌ర‌ణ ప్రారంభించింద‌ని ఆయ‌న వివ‌రించారు. విద్యా భార‌తి క్షేత్ర అధికారులు ఆయాచితుల ల‌క్ష్మ‌ణ‌రావు, జ‌గ‌దీష్, రావుల సూర్య‌నారాయ‌ణ ఈ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌యం చేశారు. మాజీ వైస్ ఛాన్స‌ల‌ర్లు తిరుప‌తిరావు, నాగేశ్వ‌ర‌రావు, విద్యావేత్త‌లు ప‌ర‌మేశ్వ‌ర హెగ్డే, రామ‌కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
 
ishna