అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తీరు పట్ల గవర్నర్ ఆగ్రహం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా  గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్  ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపులో భాగంగానే.. బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్న ప్రభుత్వ వైఖరి సరికాదని ఆమె తప్పుబట్టారు.

ప్రభుత్వం 5 నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తూ  కొనసాగింపు అనడం అనైతికమని ఆమె దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

 అయితే, సాంకేతికంగా గవర్నర్‌ ప్రసంగం తప్పనిసరి కాకపోవచ్చని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగం లేకపోయినప్పటికీ బడ్జెట్‌ సమర్పణను స్వాగతిస్తున్నట్లు గవర్నర్‌ కార్యాలయం శనివారం ఓ పత్రిక ప్రకటన విడుడల చేసింది. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించాలనే ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలించాలన్న సాంప్రదాయం తప్పనిసరి అని గుర్తుచేశారు. 

కాగా, సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభలను ఉద్దేశించి తాను చేయాల్సిన ప్రసంగాన్ని ఎత్తేసిందని ఆమె  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విజయాలను గవర్నర్‌ నోట చెప్పించి, దానిపై సభలో చర్చ జరిపే ప్రజాస్వామిక సంప్రదాయాన్ని సాంకేతిక కారణాలతో పక్కనబెట్టడం హాస్యాస్పదంగా ఉందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారని తమిళిసై పేర్కొన్నారు.సర్కారు సాంకేతిక కారణాలు చూపి, గవర్నర్‌ ప్రసంగాన్ని ఎత్తేస్తే తాను మాత్రం రాజ్యాంగ విలువలకు కట్టుబడి, రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తున్నానని  గవర్నర్ చెప్పారు. 

  ఐదు నెలల సుదీర్ఘ కాలం తర్వాత భేటీ అవుతున్నందున కొత్త సమావేశంగానే నిర్వహించాలని ఆమె తెలిపారు. గవర్నర్‌ ప్రసంగమనేది గవర్నర్‌కు సంబంధించిన అధికార వ్యవహారం కాదని ఆమె స్పష్టం చేశారు.  ప్రభుత్వం అందించే వివరాలతో కూడిన అధికారిక ప్రకటన మాత్రమేనని గుర్తు చేశారు.

తాను కూడా తనకున్న రాజ్యాంగ అధికారాలను ఉపయోగించుకొని సభలో ఆర్థిక బిల్లు ప్రవేశానికి అనుమతి ఇవ్వడానికి మరింత సమయం తీసుకోవచ్చని ఆమె గుర్తు చేశారు. అయితే, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే అనుమతి ఇచ్చానని ఆమె చెప్పారు.

రాజాకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ  ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశామని ఆమె ప్రకటించారు. సోమవారంనుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అసెంబ్లీలో గవర్నర్‌ అడుగు పెట్టకుండానే ఈ సారి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాజ్యాంగం పట్ల కేసీఆర్ అగౌరవ వైఖరి 

రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షరాలి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అవలంబిస్తున్న అగౌరవ వైఖరిని బిజెపి తీవ్రంగా ఖండించింది.  భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర గవర్నర్ కేవలం ఫిగర్ హెడ్ మాత్రమే కాదు, రాష్ట్ర కార్యవర్గానికి అధిపతి అని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు గుర్తు చేశారు. 

 ముఖ్యమంత్రి , రాష్ట్ర మంత్రివర్గంతో పాటు ఎన్నికైన ప్రభుత్వానికి గవర్నర్ ఒక ప్రాథమిక భాగం. రాష్ట్ర గవర్నర్ పాత్రను అణగదొక్కడం అనేది భారత రాజ్యాంగపు అక్షరం, స్ఫూర్తిని అణగదొక్కడం, ఉల్లంఘించడం మాత్రమే కాగలదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర బడ్జెట్ సెషన్‌లో గవర్నర్ ప్రసంగాన్ని చిన్నచిన్న కారణాలతో రద్దు చేయడం సిఎం కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో చూపిస్తుందని ఆయన మండిపడ్డారు.

చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర శాసనసభలో  బాగా స్థిరపడిన ఉత్తమ పద్ధతులు, సంప్రదాయాల నుండి ఈ దురదృష్టకర వైకల్పనాన్ని కృష్ణసాగర్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర గవర్నర్ డా.శ్రీమతి తమిలిసాయి సౌందరరాజన్‌కు జరిగిన ఈ అన్యాయమైన అగౌరవాన్ని తిరస్కరిస్తారని ఆయన హెచ్చరించారు.