ఖార్కివ్‌లో ఒక్క భారతీయడిని కూడా వదిలిపెట్టబోం

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్లో ఒక్కరిని కూడా విడిచిపెట్టబోమని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పిశోచిన్, ఖార్కివ్‌లో చిక్కుకుపోయిన ప్రతి ఒక్క భారతీయుడిని వెనక్కి తీసుకొస్తామని.. మరికొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
ఖార్కివ్‌లో అయితే, మరెవరూ లేరని తెలుస్తోందని, ఇప్పుడు తమ దృష్టినంతా సుమీపై పెట్టినట్టు చెప్పారు. పెచ్చరిల్లుతున్న హింస, సరైన రవాణా సౌకర్యం లేకపోవడం ఇప్పుడు ఇక్కడ సవాలుగా మారిందని అన్నారు. అయితే, కాల్పుల వివరణ కొంత ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నారు.
గత 24 గంటల్లో 15 విమానాలు 2,900 మందితో భారత్‌లో ల్యాండయ్యాయని, ఇప్పటి వరకు దాదాపు 13,300 మంది భారత్ చేరుకున్నారని శనివారం వివరించారు. మరో 24 గంటల్లో ఇంకో 13 విమానాలు భారత్ చేరుకుంటాయని చెప్పారు.
 ఉక్రెయిన్ సంక్షోభంల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా గత 7 రోజుల్లో ఒక్క రొమేనియా నుంచే 29 విమానాలను నడిపామని, 6222 మంది విద్యార్థులను భారత్‌కు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక ట్వీట్‌లో తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో 1050 మంది విద్యార్థులను భారత్‌కు తరలించనున్నట్టు చెప్పారు.
మరోవంక,  యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తాజాగా ఓ సలహా ఇచ్చింది. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, సురక్షితంగా ఉండటానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపింది.
తమ మంత్రిత్వ శాఖ, ఎంబసీలు విద్యార్థులతో సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పింది. ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శనివారం ఓ ట్వీట్‌లో ఈ వివరాలను వెల్లడించారు. ఉక్రెయిన్ లోని  సుమీలో భారతీయ విద్యార్థుల గురించి తీవ్ర ఆందోళనతో ఉన్నామని అరిందమ్ తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాలకు అనేక వర్గాల ద్వారా పరిస్థితిని వివరించామని, భారతీయ విద్యార్థులు సురక్షితంగా బయటపడటానికి వీలుగా తక్షణమే కాల్పులను విరమించాలని నొక్కి చెప్పామని తెలిపారు. ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ట్వీట్‌లో, సుమీ నగరం నుంచి వందలాది మంది విదేశీ విద్యార్థులను తరలించేందుకు తాము చేయగలిగినదంతా చేస్తున్నామని తెలిపింది.
బాల్టిక్ సముద్ర దేశాల మండలి నుంచి రష్యా, బెలారస్‌లను యూరోపియన్ యూనియన్ బహిష్కరించింది. ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ అత్యంత భారీ పేలుళ్ళతో దద్దరిల్లింది. కీవ్ నగరానికి సమీపంలోని మర్కలెవ్కా గ్రామంపై జరిగిన వైమానిక దాడిలో ఓ చిన్నారి సహా ఆరుగురు మరణించారు.
కాగా, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి శరణార్ధులుగా దేశం విడిచిపెట్టి వెళ్తున్న వారి సంఖ్య 10 లక్షల 45 వేలకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి మెగ్రోషన్ ఏజెన్సీ తెలిపింది. ఉక్రెయిన్ విడిచిపెట్టి సరిహద్దు దేశాల్లోకి వెళ్లిన వారిలో 138 దేశాలకు చెందిన వారు ఉన్నట్టు తెలిపింది.