రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొనకుండా `కవచ్’

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా  ఢీకొనకుండా వాటంతట అవే నిర్ణీత దూరంలో నిలిచిపోయే విధంగా రైల్వే ప్రమాదాల నివారణకు రూపొందించిన `కవచ్’ భారతీయ రైల్వేలో వినూత్నమైన ప్రయోగం.   అదేవిధంగా ఒకేట్రాక్‌పై ఒక రైలు వెనక మరో రైలు వచ్చినా.. ప్రమాదం జరగకుండా ఓ రైలు నిలిచిపోతుంది.

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా పూర్తిస్థాయిలో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘కవచ్‌’ నెట్‌వర్క్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ ఏడాది కవచ్‌ పరిధిలోకి 2 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

శుక్రవారం ఆయన లింగంపల్లి-వికారాబాద్‌ రైల్వే సెక్షన్‌ పరిధిలోని గుల్లగూడ-చిట్టిగిద్ద స్టేషన్ల మధ్య ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ (కవచ్‌) వ్యవస్థ పనితీరును పరిశీలించారు. ఆయన వెంట రైల్వేబోర్డు చైర్మన్‌/సీఈవో వీకే త్రిపాఠి, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్‌ కిశోర్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఇతర సీనియర్‌ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా రైల్వే మంత్రి ఓ లోకోమోటివ్‌లో ఉండగా.. అదే ట్రాక్‌పైన ఎదురుగా మరో రైలింజన్‌ రావడం.. కవచ్‌ భద్రతతో దాదాపు 380 మీటర్ల దూరంలో మంత్రి ఉన్న రైలు, ఎదురుగా వస్తున్న ఇంజన్‌ నిలిచిపోయాయి. ఆ కొన్ని క్షణాల ఉత్కంఠ తర్వాత విజయం సాధించామంటూ రైల్వే మంత్రి బొటనవేలితో విజయకేతనం చూపించారు.

నంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాదాల నివారణకు రిసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌ఎ్‌సవో), స్వదేశీ పరిశ్రమల సహకారంతో.. దేశీయ సాంకేతికతతో రూపొందించిన కవచ్‌ పరిజ్ఞానం భారతీయ రైల్వే చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను కవచ్‌ పరిధిలోకి తీసుకొస్తాం. ఆ తర్వాత ఏటా 4-5 వేల కిలోమీటర్లను ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చేలా ముందుకు సాగుతున్నాం. దశలవారీగా అన్ని నెట్‌వర్క్‌లలో కవచ్‌ను అమలు చేస్తాం’’ అని కేంద్ర మంత్రి వివరించారు.

ఈ పరిజ్ఞానాన్ని విదేశాలకు ఎగుమతి కూడా చేస్తామని చెప్పారు. ఐరోపా దేశాల్లో ఉన్న పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటే.. ప్రతి కిలోమీటర్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందని, అదే కవచ్‌ వల్ల రూ.50 లక్షల్లోపు ఖర్చు సరిపోతుందని ఆయన తెలిపారు.

భద్రతలో స్టాండర్డ్‌-4ను కవచ్‌ కలిగి ఉందని పేర్కొన్నారు. రైళ్లు ఎదురెదురుగా వచ్చేప్పుడే కాకుండా, పట్టాల్లో లోపాలున్నా కవచ్‌ ఆ మార్గంలో వచ్చే రైలును నిలిపివేస్తుందని చెప్పారు. . ఒకే ట్రాక్‌పై ఒకే దిశలో రెండు రైళ్లు వెళ్తున్నా.. వెనక వచ్చే ట్రైన్‌ దూరాన్ని తగ్గించి, ప్రమాదం జరగకుండా చూస్తుందని వివరించారు.

అదే సమయంలో లోకోపైలట్‌ను అప్రమత్తం చేస్తుందని వెల్లడించారు. సిగ్నలింగ్‌ వ్యవస్థకూ కవచ్‌తో అనుసంధానం ఉంటుందని, పొగమంచు కారణంగా రెడ్‌ సిగ్నల్‌ కనిపించక.. లోకోపైలట్‌ ముందుకు వెళ్తుంటే హెచ్చరిస్తుందని తెలిపారు.

‘‘180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లపై కవచ్‌ ప్రయోగం విజయవంతమైంది. ఇది సంతోషకరమైన విషయం. ప్రధాని దూరదృష్టి, మన ఇంజనీర్ల కృషి ఈ ప్రాజెక్టు. త్వరలో 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లపైనా పరిశోధనలు చేస్తాం’’ అని పేర్కొన్నారు.

మరిన్ని ప్రత్యేకతలు 

* ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చే రైళ్లను 380 మీటర్ల దూరంలోనే నిలిపేస్తుంది

* వంతెనలు, మలుపులు(బాటిల్‌నెక్స్‌) ఉన్నచోట్ల రైళ్ల వేగంపై నియంత్రణ ఉండాలి. 30 కిమీ వేగాన్ని దాటకూడదు. కవచ్‌ వ్యవస్థ ఈ ప్రాంతాల్లో అతి వేగాన్ని నియంత్రించి, రైళ్ల స్పీడ్‌ను 30 కిమీకి తీసుకువస్తుందిఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చే రైళ్లను 380 మీటర్ల దూరంలోనే నిలిపేస్తుంది

*పరిమితికి మించిన వేగాన్ని లోకోపైలట్‌ నియంత్రించలేకపోతే.. కవచ్‌ ఆ రైలులోని బ్రేకింగ్‌ వ్యవస్థపై ఆటోమేటిక్‌గా పనిచేసి, వేగాన్ని తగ్గిస్తుంది

*దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు 1,098 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు కవచ్‌ పరిధిలోకి వచ్చాయి. 65 రైళ్లలోనూ దీన్ని అమలు చేస్తున్నారు. ఈ రైళ్లన్నీ గంటకు 160 కిమీ వేగంతో వెళ్తాయి

*వాడి-వికారాబాద్‌, సనత్‌నగర్‌, వికారాబాద్‌-బీదర్‌ సెక్షన్లలోని 25 స్టేషన్ల పరిధిలో 264 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిస్థాయిలో కవచ్‌ పరిధిలోకి తీసుకువచ్చారు

* కవచ్‌ వ్యవస్థలో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్‌ డివైజ్‌లను వినియోగిస్తారు. రైల్వే ట్రాక్‌లపై, రేల్వేస్టేషన్లలో, రైళ్లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కార్ల విండ్‌షీల్డ్‌పై ఉండే రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎ్‌ఫఐడీ) ఫాస్టాగ్‌ల కంటే.. కవచ్‌లో వినియోగించే ఫ్రీక్వెన్సీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది