కొత్త కూటమి ఏర్పాటుపై కేసీఆర్ కు ఆశాభంగం!

బిజెపి, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో మరో కూటమి ఏర్పాటు చేయబోతున్నట్లు కొద్దీ రోజులుగా హడావుడి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఈ విషయంలో తీవ్ర ఆశాభంగం కలిగిన్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయమై మిగిలిన పార్టీల నుండి అందుకు తగిన స్పందన లేకపోవడమే కారణంగా తెలుస్తున్నది. 
 
ఢిల్లీలో మూడు రోజుల పాటు మకాం వేసిన ఆయన మూడో కూటమి గురించి వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపబోతున్నట్లు ఆయన పార్టీకి చెందిన వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే చెప్పుకోదగిన ఒక నాయకుడిని కూడా కలవలేక పోయారు. కేవలం భార్యతో కలసి ఆసుపత్రుల సందర్శనకు పరిమితమయ్యారు. 
 
ఢిల్లీలో ఆయనను ఇద్దరు మాత్రమే కలిశారు. వారిలో ఒక్కరు  బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కాగా, మరొకరు రైతు నాయకుడు రాకేష్ తికావత్. స్వామికి రాజ్యసభ సీట్ కొద్దీ రోజులలో పూర్తి కాబోతున్నది. ఆయనను తిరిగి రాజ్యసభకు పంపే ఆలోచనలు బీజేపీలో కనిపించడం లేదు. మరోవంక, గత ఏడాది బిజెపి జాతీయ కార్యవర్గంలో ఆయనకు  స్థానం ఇవ్వలేదు. అప్పటి నుండి బిజెపియేతర సీఎంలను కలుస్తున్నారు. 
 
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, మమతా బనెర్జీ వంటి వార్లను కూడా ఆయన ఇటీవల కాలంలో కలిశారు. వారిలో ఎవరైనా రాజ్యసభకు పంపవచ్చనే ఆలోచన కావచ్చు. కానీ మూడో కూటమి ఏర్పాటులో ఆయన వహించగల పాత్ర పెద్దగా ఉండబోదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనను కలవబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన ఆయన కనీసం తన మంత్రులు ఎవ్వరిని కూడా కేసీఆర్ వద్దకు పంపలేదు.
 
ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసికి వెళ్లి అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా జరిగే ప్రచారంలో పాల్గొంటారని కూడా టి ఆర్ ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. పైగా, మమతా బెనర్జీతో కలసి ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. అయితే ఆమె వారణాసి ప్రచారంపై  వెళ్లినా, కేసీఆర్ వెళ్ళలేదు. 
 
ఆయన వస్తారని అనుకుంటా ఆయన ఫోటోటోలతో టి ఆర్ ఎస్ కట్ అవుట్ లను సహితం అక్కడ ఏర్పాటు చేశారు. ఆయనకు ఆహ్వానం రాక వెళ్లలేదా? ఈ విషయమై ఆయన సన్నిహితులు మౌనం దాలుస్తున్నారు. 
 
ఇక శుక్రవారం రాంచి వెళ్లిన, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ ను కలసిన ఆయన ఆ తర్వాత ఇప్పట్లో మరో కూటమి ఆలోచన లేదని చెప్పడం గమనార్హం. బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ కూటమి(ఫ్రంట్) ఏర్పాటు కాలేదని స్పష్టం చేశారు. పైగా, బిజెపికి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు జరగడం లేదని కూడా చెప్పారు. ఆ విషయమై త్వరలో చెబుతానని అంటూ దాటవేశారు.
 
ఈ సందర్భంగా త్వరలోనే మరికొందరు నేతలను కలుస్తామని చెబుతూ  దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాలని పేర్కొంటూ తాము ఎవరికీ వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదని తేల్చిచెప్పడం గమనార్హం. దేశ హితం కోసమే తమ ప్రణాళిక అని తెలిపారు. 
 
ఆయన సంప్రదిస్తున్న ఉద్ధవ్ థాకారే, ఎంకే స్టాలిన్, శిబూ సొరేన్ ప్రభుత్వాలలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. దానితో వారు కాంగ్రెస్ నేతృత్వంకు వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటుకు సహకరించే అవకాశం లేదు. వామపక్షాలు సహితం కాంగ్రెస్ లేని కూటమి వల్లన ప్రయోజనం ఉండకపోవచ్చని పెదవి విరుస్తున్నాయి. 
 
అందుకనే కాంగ్రెస్ కు  సందేశం  పంపడం కోసమై రాహుల్ గాంధీ గురించి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ చేసిన ఒక వాఖ్య గురించి కేసీఆర్ రాద్ధాంతం చేశారు. అయినా కాంగ్రెస్ వారి నుండి ఆయన పట్ల సానుకూలంగా స్పందన లేదు. ఏది ఏమైనా ఢిల్లీ పర్యటన కేసీఆర్ కూటమి సన్నాహాలను నిరుత్సాహ పరచిన్నట్లు స్పష్టం అవుతున్నది. 
 
ఇలా ఉండగా,  అవినీతిలో కేసీఆర్ పీహెచ్‌డీ చేశారని  ఆప్‌ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి  . తెలంగాణ ఉద్యమకారులను, యువతను కేసీఆర్ మోసం చేశారని అంటూ సంచలన వాఖ్యలు చేశారు. ‘‘దళితుల ఓట్లతో కేసీఆర్ సీఎం అయ్యారు. దళిత సీఎం, మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశారు” అంటూ ధ్వజమెత్తారు. 
 
” కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో అవినీతి ఉంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయం. దేశంలోని ప్రతి పార్టీ ఒక వ్యక్తిగత ఎజెండాతో ఉన్నాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకమైన ఫ్రంట్ దేశంలో అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకు మంచి చేసే ఫ్రంట్ కావాలి. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారు’’ అని సోమ్నాథ్‌ ఆరోపించారు.