ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హతమార్చే యత్నం!

ఉక్రెయిన్ పై 10 రోజులుగా భీకర పోరాటం చేస్తున్న రష్యా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని, కీలుబొమ్మ ప్రభుత్వంను అక్కడ ఏర్పాటు చేయడం ఒక లక్ష్యంగా చేసుకొని వేగంగా కదులుతుండగా, మరోవంక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని హతమార్చడమే లక్ష్యంగా ముమ్మర ప్రయత్నం చేస్తున్నట్లు వార్తాకథనాలు వస్తున్నాయి. అందుకోసం తమ సైనికులను కాకుండా `కిరాయి సైనికులు’ను ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఒక వంక యుద్ధం జరుగుతూ ఉండగా, వీరు నేరుగా ఆ దేశ రాజధాని కీవ్‌ నగరానికి చేరుకొని, అధ్యక్షుడిని హతమార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గత వారం రోజులుగా కనీసం మూడు సార్లు అటువంటి ప్రయత్నాలు చేశారని, అయితే అవి విఫలమయ్యాయని లండన్‌కు చెందిన ఓ మీడియా కథనం వెలువడింది. 

ఈ కధనం ప్రకారం.. జెలెన్‌స్కీని హత్య చేసేందుకు రష్యా మద్దతు ఉన్న వాగ్నర్‌ గ్రూప్‌, చెచెన్‌ రెబెల్స్‌ అనే రెండు బృందాల ప్రైవేటు సైన్యం ఉక్రెయిన్‌ చేరింది. జెలెన్‌స్కీని హతమార్చేందుకు మూడు సార్లు కుట్ర పన్నింది. కానీ, ఉక్రెయిన్‌ దళాల అప్రమత్తతతో.. వారి యత్నాలు భగ్నమయ్యాయి. ఇదే విషయాన్ని ఉక్రెయిన్‌ నేషనల్‌ సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ఒలెక్సీ డానిలోవ్‌ కూడా వెల్లడించారు. 

రష్యా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్న ఆ దేశ ఫెడరల్‌ సెక్యూరిటీ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సబీ) జెలెన్‌స్కీ హత్యకు కుట్ర జరుగుతోందని ముందుగానే హెచ్చరించిందని తెలిపారు. దీంతో తమ దళాలు.. కీవ్‌ సరిహద్దుల్లోనే వాగ్నర్‌ గ్రూపునకు చెందిన చాలామందిని హతమార్చాయని చెప్పారు. అలాగే, చెచెన్‌ రెబెల్స్‌ను కూడా దీటుగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. కాగా, తనతో నేరుగా చర్చలకు రావాలంటూ జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆహ్వానించారు. అప్పుడే యుద్దానికి ముగింపు రాగలదని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా,  ఉక్రెయిన్‌పై దాడిలో భాగంగా శనివారం రష్యా వాయుసేన దళాలు జరిపిన దాడుల్లో ఐదార్ నేషనలిస్ట్ బెటాలియన్ కమాండ్‌ను ధ్వంసం చేశాయి.  డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లోని ఐదార్ నేషనలిస్ట్ బెటాలియన్ కమాండ్, అబ్జర్వేషన్ పోస్ట్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రష్యా వాయుసేన ఓరియన్ డ్రోన్ 250 కిలోల బరువుగల పేలుడు పదార్థాలతో కూడిన క్షిపణిని ప్రయోగించింది.

డ్రోన్ స్ట్రైక్ ద్వారా ధ్వంసమైన ‘ఐదార్’ బెటాలియన్ వీడియోను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.‘‘డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ భూభాగంలో రష్యన్ ఏరోస్పేస్ ఫోర్సెస్‌కు చెందిన ఇనోఖోడెట్స్ మానవరహిత వైమానిక విమానం ఐదార్ బెటాలియన్ కమాండ్, అబ్జర్వేషన్ పోస్ట్‌ను ధ్వంసం చేసింది. గైడెడ్ ఎయిర్-లాంచ్ ప్రొజెక్టైల్ ద్వారా సైట్ ను నాశనం చేసింది’’అని రష్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

మరోవంక, శుక్రవారం వోల్నోవఖా సిటీ సమీపంలో రష్యాకు చెందిన రెండు జెట్ ఫైటర్లను ఉక్రెయిన్ సోల్జర్లు కూల్చేశారు. హాస్టోమెల్, బ్రోవరీ సిటీల వద్ద పలు యుద్ధట్యాంకులను పేల్చివేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున రష్యన్ సోల్జర్లు చనిపోయారని, అనేక వెహికల్స్ ధ్వంసం అయ్యాయని చెప్తున్నారు. ఇప్పటివరకూ 9,200 మంది రష్యన్ సోల్జర్లను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది. 

వందలాది యుద్ధట్యాంకులను, దాదాపు వెయ్యి ఆర్మర్డ్ వెహికల్స్ ను, పదులకొద్దీ హెలికాప్టర్లు, జెట్​లను పేల్చివేశామని వెల్లడించింది.  ఇప్పటివరకు ఉక్రెయిన్ సైనికులు 300 మిసైల్స్ ప్రయోగించి.. 280 రష్యన్ యుద్ధట్యాంకులను పేల్చేశారని అమెరికన్ జర్నలిస్టు జాక్ మర్ఫీ  తెలిపారు. జావెలిన్ మిసైల్స్ 93% కిల్ రేట్​ను సాధించాయన్నారు. ట్యాంకుల పైభాగం నుంచి దాడిచేయడంవల్లే ఈ మిసైల్స్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందన్నారు.