రెండేళ్లలో వేయి ఆలయాల నిర్మాణం… టిటిడి నిర్ణయం 

రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి ఆలయాలు నిర్మించాలని  తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) కీలక నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్సీ, బీసీ ప్రాంతాల్లో వెయ్యి ఆలయాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. 

వడమాలపేట మండలం  అప్పలాయగుంటలో రూ.3.4 కోట్లతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాన్ని నగరి ఎమ్మెల్యే రోజాతో కలసి, ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తి మేరకు అప్పలాయగుంటలో మూడు అంత‌స్తుల్లో క‌ల్యాణ మండ‌పం నిర్మించామని  ఆయన చెప్పారు. సకల సదుపాయాలతో, తక్కువ అద్దెకు, 700 మంది ఆహ్వానితులతో ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చని తెలిపారు. 

ఆలయంలోనూ రూ.2.25 కోట్లతో ప‌లు అభివృద్ధి ప‌నులు చేపట్టామని వెల్లడించారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నగరిలో దేశమ్మ ఆలయ అభివృద్ధికి రూ. కోటి 20 లక్షలు, పుత్తూరు ద్రౌపతి ఆలయ అభివృద్ధికి రూ కోటి 25 లక్షలు, నిండ్రలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.కోటి 70 లక్షలు మంజూరు చేశామని వివరించారు. 

పుత్తూరు లో శివాలయం కోనేరు అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేశామని, మరిన్ని అభివృద్ధి పనుల కోసం కూడా నిధులు మంజూరు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. నగరిలో టీటీడీ కల్యాణ మండపం మంజూరు చేస్తామని చెప్పారు.

చెన్నై నుంచి కాలినడకన వచ్చే భక్తులు అప్పలాయగుంటలో స్వామివారి దర్శనం చేసుకుని తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోందని ఎమ్మెల్యే రోజా తెలిపారు. టీటీడీ కల్యాణ మండపాల్లో పెళ్లి చేసుకుంటే వధూవరులకు స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఆర్జిత సేవలు, దర్శనాల ధరలు పెంచలేదు 

కాగా, ఇప్పటి వరకు సామాన్య భక్తులకు అందించే ఆర్జిత సేవలు, దర్శనాల ధరలను పెంచలేదని, పెంచే ఆలోచన ఇప్పట్లో లేదని టిటిడి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ధరల పెంపుపై పాలకమండలిలో కేవలం చర్చ మాత్రమే జరిగిందని చెప్పారు. కొండ మీద ఆహారం విక్రయించరాదని టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పిఎసి – 4 (పాత అన్నప్రసాద భవనం) లోని లగేజీ సెంటర్‌ను శుక్రవారం అధికారులతో కలిసి చైర్మన్‌ తనిఖీ చేపట్టారు. అసర్వదర్శనం ప్రారంభమైన తరువాత తిరుమలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ దృష్ట్యా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అల్ఫాహారం, అన్నప్రసాదాలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

ఉత్తర భారతదేశం నుంచి వచ్చే సందర్శకుల కోసం భోజనంతో పాటు రొట్టెలు, చపాతీలను అందిస్తామని చెప్పారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్జిత సేవలను పున్ణప్రారంభించేందుకు సమయం పడుతుందని, ఏప్రిల్‌ నుంచి అన్ని సేవలనూ ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.