ఓడిపోతామనే భయంతోనే బిజెపి నాయకులపై తప్పుడు కేసులు 

కేసీఆర్‌కు ఓడిపోతాన‌నే భ‌యం ప‌ట్టుకుందని,  అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు, నాయ‌కుల‌పై త‌ప్పుడు కేసులు పెడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నాడని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. 

 తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు సంబంధించి ప్రతిరోజూ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అటు ఇంటెలిజెన్స్‎కు, ఇటు డిపార్ట్‎మెంట్లకు కేసీఆర్ సర్కార్ నుంచి ఇంటర్నల్ ఆదేశాలు వెళ్లాయని ఆమె చెప్పారు. 

ఆ ధర్నాల వెనక పొలిటికల్ అజెండా ఏమైనా ఉందా? అని,  ఏ లీడర్లు పాల్గొన్నారు? అని,  సమస్య ఏంటి? అనే వివరాలను పంపాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారని విజయశాంతి తెలిపారు. ఈ ఆదేశాలు చూస్తే కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి రాడని తేలిపోయిందని ఆమె స్పష్టం చేశారు.

అందుకే అధికారుల‌ను ఉప‌యోగించుకుని అధికారం నిల‌బెట్టుకోవాల‌ని చూస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. మొన్నటి దాకా రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరిగే ముఖ్యమైన ధర్నాలు, పెద్ద స్థాయి లీడర్లు పాల్గొనే ఆందోళనలపై మాత్రమే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చేది. ఇప్పటి నుంచి మండల స్థాయి వరకూ వెళ్లాలని ఆదేశించారని ఆమె చెప్పారు.

రాష్ట్రంలోని ఏ మండలంలో అయినా సరే… చిన్న పొలిటికల్ మీటింగ్, నిరసన, ఆందోళన జరిగినా… వాటి వివరాలను ఇంటెలిజెన్స్ ఇవ్వాలని, ఒకవేళ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన సమస్యలైతే ఆయా డిపార్ట్‌మెంట్లు జీఏడీకి రిపోర్టు పంపాలని కేసీఆర్ స‌ర్కార్ నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆమె తెలిపారు.

కాగా, మూడ్రోజుల కిందట మండల స్థాయి నుంచి డేటా తెప్పించగా… ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో పొలిటికల్ మీటింగ్స్, ఆందోళనలు, నిరసనలన్నీ కలిపి 180 జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఏయే విషయాలపై మండల స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే దానిపై ప్రతిరోజూ సీఎంవోకు రిపోర్టు వెళ్తోంది.

అందులో ఉన్న అంశాల ప్రకారం… పొలిటికల్ మీటింగ్అయితే ఎంతమంది వస్తున్నారు?. అపోజిషన్ పార్టీ వాళ్లా?, మండల, జిల్లా స్థాయిలో ఏ లీడర్ ఎంత మేరకు ప్రభావం చేయగలుగుతారు?… అనే వివరాలను కూడా పంపాలని ఆదేశించారని ఆమె వివరించారు.

“కేసీఆర్… నువ్వెన్ని రిపోర్టులు తెచ్చుకున్నా… ఎన్ని జిమ్మిక్కులు చేసినా… నీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బంగాళాఖాతంలో కలప‌డం ఖాయం.’’ అని విజయశాంతి హెచ్చరించారు.