ఐరాసలో మరోసారి ఓటింగ్ కు భారత్ దూరం

రష్యా సైనికచర్యతో ఉక్రెయిన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, తదితర నేరాలపై విచారణకు అత్యవసరంగా స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు  ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో నిర్వహించిన ఓటింగ్‌కు కూడా భారత్‌ దూరంగా ఉండిపోయింది.

ముసాయిదా తీర్మానంపై 47 సభ్య దేశాలకుగాను 32 అనుకూలంగాను.. 2 (రష్యా, ఎరిత్రియా) దేశాలు వ్యతిరేకంగాను ఓటు వేశాయి. భారత్‌, చైనా, పాకిస్థాన్‌, సూడాన్‌, వెనెజువెలా సహా 13 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి.

అనుకూలంగా ఓటు వేసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, నేపాల్‌, యుఎఈ, తదితర దేశాలున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఈ తీర్మానం తీవ్రంగా ఖండించింది. విచారణ కమిషన్‌లో… ముగ్గురు మానవహక్కుల నిపుణులను నియమిస్తారు. ప్రాథమికంగా ఈ కమిషన్‌ కాల వ్యవధిని ఒక సంవత్సరంగా నిర్ణయించారు.

ఉక్రెయిన్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు, వేధింపులు, అంతర్జాతీయ హ్యుమానిటేరియన్‌ చట్టం ఉల్లంఘన వంటివాటికి తక్షణం ముగింపు పలకాలని తీర్మానంలో రష్యాను కోరారు. తక్షణం బలగాలను ఉపసంహరించాలని కోరింది. రష్యాకు వ్యతిరేకంగా ఇప్పటికే ఐరాస భద్రతామండలి, సర్వప్రతినిధి సభల్లో నిర్వహించిన ఓటింగ్‌లకు భారత్‌ దూరంగా ఉన్న సంగతి విదితమే.