ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల కోర్స్ పూర్తిపై ప్రభుత్వం దృష్టి 

భీకర యుద్ధం ప్రారంభం కావడంతో ప్రాణాలకు తెగించి, దేశ సరిహద్దులను దాటి, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాలలో స్వదేశానికి వచ్చిన ఉక్రెయిన్ లో వైద్య విద్య చేస్తున్న వేలాదిమంది విద్యార్థులకు స్వదేశంలోనే ఆ కోర్స్ పూర్తిచేసే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 

వారు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ తమ చదువు మధ్యలో ఆగిపోతుందా అని భయాందోళనలు చెందుతున్నారు. వారి తల్లిదండ్రులలో కూడా ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఊరటనిచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 

ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసి) నిబంధనలు సడలించడమో లేక ఇతర దేశాల్లో వారు వైద్య విద్యను పూర్తిచేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమో చేయాలనుకుంటోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఎన్‌ఎంసి నిబంధనల ప్రకారం విదేశాల్లో మెడిసిన్ చదువుతూ మధ్యలో స్వదేశానికి వచ్చి ఇక్కడ కోర్సు పూర్తి చేయడానికి అవకాశం లేదు. అయితే ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడ మెడిసిన్ పూర్తిచేయలేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై కేంద్రం దృష్టిపెట్టింది.

జాతీయ మెడికల్ కమిషన్-2021 నిబంధనల ప్రకారం విదేశాల్లో మెడిసిన్ చదివే విద్యార్థులు మిగిలిన చదువును ఇక్కడే పూర్తి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. నిజానికి ప్రాథమిక వైద్యవిద్య ప్రారంభమైనచోటే కోర్స్ మొత్తం పూర్తి చేయాలి. 

కానీ ప్రత్యేక కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధన తీసుకురానున్నట్లు, దీని కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయమై పూర్తి స్పష్టత రావడానికి కొంతకాలం పట్టవచ్చు. 

ఉక్రెయిన్ విద్యార్థులకు స్వదేశంలోని ప్రైవేట్ కాలేజిల్లో కోర్సు పూర్తిచేయడం/విదేశాల్లోని కాలేజ్‌లకు బదిలీ చేసుకునే వీలు కలిపించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆరోగ్యశాఖ, జాతీయ మెడికల్ కమిషన్ చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశానికి సంబంధించి జాతీయ మెడికల్ కమిషన్, ఆరోగ్యశాఖ, విదేశాంగ శాఖతోపాటు నీతి ఆయోగ్ త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. 

ఉక్రెయిన్‌లో ఎంబిబిఎస్ కోర్సు ఆరు సంవత్సరాలు, దానికితోడు రెండేళ్లు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. భారత్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లతో పోలిస్తే ఉక్రెయిన్‌లో ఎంబిబిఎస్ కోర్సుకు అయ్యే ఖర్చు తక్కువ. అందుకనే ప్రతి సంవత్సరం వేలాది మంది వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్‌కు లైన్ కడుతుంటారు.