`ఆపరేషన్ గంగ’కు సుప్రీంకోర్టు ప్రశంసలు

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గొప్ప చర్యలు చేపట్టిందని సంతృప్తిని వ్యక్తం చేసింది. 

భారతీయుల తరలింపు, సాయం కోసం హెల్ప్ డెస్కు ఏర్పాటు చేయాలన్న పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు బాధపై ఆందోళన వ్యక్తం చేసింది. 

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన వెంటనే ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కోసం ఆందోళనలు వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని,  ఇప్పటివరకు 17 వేల మందిని ఉక్రెయిన్ సరిహద్దులు దాటించినట్టు అటార్నీ జనరల్ వేణుగోపాల్ తెలిపారు. 

ముఖ్యంగా  ఉక్రెయిన్ లో చదువుతున్న వేలాది మంది వైద్య విద్యార్థుల తరలింపులో ఏజీ వేణుగోపాల్ కృషి చేశారని  సుప్రీంకోర్టు కొనియాడింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి తరలింపులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. 

ఇలా  ఉండగా, యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం పురోగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ అంశంపై మోదీ నిర్వహించిన ఎనిమిదో సమావేశమిది. 

కీవ్ నగరంలో ఓ భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మోదీ వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్,  ఉక్రెయిన్  అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీలతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్ గంగ’ను నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న నాలుగు దేశాలకు విమానాలను పంపించి, అక్కడి నుంచి భారతీయులను ఉక్రెయిన్ నుంచి తీసుకొస్తున్నారు. ఈ నాలుగు దేశాల నుంచి భారతీయులను రప్పించే కార్యక్రమాన్ని నలుగురు కేంద్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.

గురువారం రాత్రి భారత వాయు సేనకు చెందిన మూడు  సీ-17 విమానాల్లో 630 మంది హిందోన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. రొమేనియా, హంగరీల నుంచి ఈ విమానాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి భారత దేశానికి చేరుకున్నవారి సంఖ్య 9,000కు చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరో 630 మంది భారత పౌరులు ఈ రోజు ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. రొమేనియా, హంగేరిల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల నుంచి నిన్న రాత్రి బయలుదేరిన మూడు సీ17 విమానాలు ఉదయం ఢిల్లీ సమీపంలో హిండన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి. వీటిలో 630 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.