భారతీయ విద్యార్థుల తరలింపుకు రష్యా  బస్సులు

ఉక్రెయిన్ లోని ఖర్కోవ్, సుమీ నగరాల నుంచి భారతీయ విద్యార్థులతోపాటు ఇతర దేశీయులను రష్యా సరిహద్దు బెల్గొరాడ్ రీజియన్‌కు తరలించడానికి 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని రష్యా ప్రకటించింది. రష్యా అగ్రస్థాయి మిలిటరీ జనరల్ ఈ ప్రకటన చేశారు.

ఉక్రెయిన్ లోని యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి క్షేమంగా భారతీయ విద్యార్థులను తరలించేలా చూడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోదీ బుధవారం చర్చించిన దానికి స్పందనగా రష్యా నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ అధినేత కల్నల్ జనరల్ మైఖాయిల్ మిజింట్స్‌వ్ బస్సుల ఏర్పాట్లపై ప్రకటించారు.

గురువారం ఉదయం 6 గంటల నుంచి బెల్గొరాడ్ రీజియన్ లోని నెఖొటెయెవ్‌కా, సుధ్జా చెక్‌పోస్టుల నుంచి ఖర్కోవ్, సుమీ లకు వెళ్లడానికి 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఈ స్థలాల్లో తాత్కాలిక వసతులు ఏర్పాటు చేశామని, మిగిలినవి చెక్‌పోస్టుల వద్ద కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

శరణార్థులకు భోజనం, ఔషధాల నిల్వలతో మొబైల్ క్లినిక్‌లు ఏర్పాటైనట్టు తెలిపారు. బెల్గొరాడ్ వరకు బస్సులపై వెళ్లినవారు అక్కడ నుంచి స్వదేశాలకు రష్యా మిలిటరీ విమానాలతో సహా విమానాల ద్వారా వెళ్లవచ్చని వివరించారు. కాగా,  రష్యా అంతరిక్ష ప్ర‌యోగ రాకెట్‌పై ఉన్న యూఎస్, యూకే, జపాన్ జెండాలను తొల‌గించిన ర‌ష్యా.. భార‌త్ జెండాను మాత్రం అట్లాగే ఉంచడం గమనార్హం. 

6,400 మంది భారత్ కు తరలింపు 

మరోవంక, ఉక్రెయిన్‌పై రష్యా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్న వేళ అప్రమత్తమైన భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను వేగంగా స్వదేశానికి తరలిస్తోంది. గురువారం ఒక్క రోజే ఏకంగా 15 విమానాల్లో 3వేల మందిని తరలించింది.

ఇప్పటి వరకు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటి వరకు 30 విమానాల్లో 6,400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. మరో 24 గంటల్లో 18 విమానాలు రానున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

ఇప్పటి వరకు 20 వేల మంది ఇండియన్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, కానీ చేసుకోనివారు కూడా చాలామందే ఉన్నారని బాగ్చి తెలిపారు. ఖార్కివ్‌లోనే ఇంకా కొన్ని వందలమంది ఉన్నట్టు అంచనా వేశామన్నారు. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 

ఇలా ఉండగా, ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు, అక్కడి పరిస్థితులపై చర్చించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ సమావేశమైంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, శశిథరూర్ తో పాటు మొత్తం ఆరు పార్టీల నుంచి 9 మంది సభ్యులు పాల్గొన్నారు. 

చైనా, పాకిస్థాన్ రష్యాకు దగ్గరవుతున్నాయని రాహుల్ గాంధీ అన్నాఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడం మన మొదటి ప్రాధాన్యతగా ఉండాలని ఆయన చెప్పారు. జాతీయ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పని చేస్తాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హామీ ఇచ్చారు.