విధ్వంసం ఆపబోమని రష్యా అనడంతో చర్చలకు ప్రతిష్టంభన 

ఒక ప్రక్కన శాంతి చర్చలకు సిద్ధమంటూ, మరోవంక తమ విధ్వంసం ఆపబోమని రష్యా స్పష్టం చేయడంతో చర్చల పట్ల ఉక్రెయిన్ విముఖత వ్యక్తం చేస్తున్నది. దానితో బుధవారం రాత్రి ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగవలసిన చర్చలు ముందుగా దాడులను ఆపాలని రష్యాకు ఉక్రెయిన్ షరతు విధించడంతో రద్దయ్యాయి. 

ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమేనని, అయితే ఆ దేశ సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడాన్ని ఆపబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌ ముందు కొన్ని డిమాండ్లను పెట్టి, స్పందన కోసం రష్యా ఎదురు చూస్తోంది. తన వల్ల సైనిక ముప్పు ఉండబోదనే నిబంధనను చర్చల ఎజెండాలో ఉక్రెయిన్ పెట్టాలని రష్యా కోరింది. 

అణు యుద్ధం గురించి ఆలోచనలు పాశ్చాత్య దేశాల రాజకీయ నాయకుల మనసుల్లో గింగిరాలు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆ ఆలోచనలు రష్యన్ల మనసుల్లో లేవని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యాలో నిరసన వ్యక్తమవుతోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పదుల సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ దృఢ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. యుద్ధం తర్వాత తన దేశాన్ని పునర్నిర్మిస్తానని శపథం చేశారు. తమ దేశానికి రష్యా వల్ల జరిగిన నష్టాలన్నిటినీ ఆ దేశం భర్తీ చేస్తుందని భరోసా ఇస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కివ్‌లో రష్యా సేనలు పెద్ద ఎత్తున బాంబులను కురిపిస్తున్నాయి. ఖెర్సోన్ నగరం రష్యా దళాల వశమైంది. ఖెర్సోన్ వ్యూహాత్మక ప్రాధాన్యంగల నగరం.

మరోవంక, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బుధవారం భారీ మెజారిటీతో ఆమోదించిన తీర్మానంలో రష్యా తక్షణమే ఈ యుద్ధాన్ని ఆపాలని కోరింది.

యుద్ధంలో రష్యాకు భారీ నష్టం 

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు భారీ నష్టం జరిగింది. మేజర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ ఆండ్రీ సుఖొవెట్‌స్కీయి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో  రష్యా దళాలు అత్యున్నత స్థాయి నేతను కోల్పోవడం  ఇదే మొదటిసారి. రష్యన్ ఎయిర్‌బోర్న్ ట్రూప్స్‌ మౌంటెన్ ఎయిర్ అజాల్ట్‌కు చెందిన నోవోరోస్సియ్‌స్క్ గార్డ్స్ కమాండర్‌గా ఆండ్రీ సేవలందించారు.  

ఈ వార్తను రష్యా అధికారికంగా ధ్రువీకరించవలసి ఉంది. ఈ యుద్ధంలో 498 మంది సైనికులను తాము కోల్పోయినట్లు రష్యా ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ విడుదల చేసిన ప్రకటనలో 9,000 మందికిపైగా రష్యన్ సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

మరోవంక, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) విచారణ ప్రారంభించిందని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ చెప్పారు. 

‘‘రష్యా యుద్ధంపై దర్యాప్తు చేయాలనే నా నిర్ణయాన్ని  కొద్ది క్షణాల క్రితం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రెసిడెన్సీకి తెలిపాను. సాక్ష్యాధారాల సేకరణతో మా పని ప్రారంభించాం’’ అని ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.కోర్టు పరిధిలో నేరాలను నిర్ధారించనున్నారు. పలు పాశ్చాత్య దేశాలు రష్యా సైనిక చర్యను తీవ్రంగా ఖండించాయి. 

కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా దళాలకు విపరీతమైన ప్రతిఘటన ఎదురవుతోందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు ఓ వార్త సంస్థ తెలిపింది. ఖెర్సోన్ మినహా, ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్ సహా ఇతర ముఖ్యమైన నగరాలను స్వాధీనం చేసుకోవడంలో గడచిన మూడు రోజుల్లో రష్యన్ దళాలు చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించలేకపోయాయని తెలిపింది. 

ఖార్కివ్, చెర్నిహివ్, మరియుపోల్ నగరాలు ఇప్పటికీ ఉక్రెయిన్ నియంత్రణలోనే ఉన్నట్లు తెలిపింది. రష్యన్ దళాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నప్పటికీ ఉక్రెయినియన్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని చెప్పింది. కీవ్ నగరంవైపు వెళ్తున్న రష్యన్ దళాల్లో ప్రధాన విభాగాలు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయని తెలిపింది.