బిజెపి నేతలపై భూటకపు కేసులు… డీకే అరుణ ఆగ్రహం 

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య చేయాలని కొందరు సఫారీ తీసుకొన్నారని వెల్లడిస్తూ, కొద్దీ మందిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఈ హత్య వెనుక డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి బిజెపి నాయకుల ప్రమేయం గురించి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమీషనర్ స్టెఫిన్ ప్రకటించడం పట్ల బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై భూటకపు కేసులు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. 

ఇళ్లపై రాళ్లు వేయడం ఏం రాజకీయం అని ఆమె ప్రశ్నించారు. పోలీస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర టీఆర్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆమె ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న స్టీఫెన్ రవీంద్ర ఇలా మాట్లాడటం సరికాదని ఆమె హితవు చెప్పారు.  అప్పుడు పులి కాస్త ఇప్పుడు పిల్లి అయిపోయిందని అరుణ ఎద్దేవా చేశారు. 

ఈ కేసుల వెనుక సీఎం కేసీఆర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్య కుట్ర అనేది పచ్చి అబద్ధం, కల్పితం అని ఆమె స్పష్టం చేసారు. ఈ విషయమై విచారణకు తాము ఎప్పుడైనా సహకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. తమకు ఎలాంటి భయం లేదని తేల్చి చెప్పారు. 

విచారణకు రమ్మంటే ఆఫీసులకు వస్తా అని ప్రకటించారు.. ఇదంతా వారు చేసిన కుట్రలో భాగమే ఆమె విమర్శించారు. ఎవరు ఎవరిపై కుట్ర చేశారు? ఎందుకు కుట్ర చేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఈ నిజా నిజాలన్నీ తేటా తెల్లంకావాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు. 

అందుకోసం  కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ  సీబీఐతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాల్సిందే అని ఆమె డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్న పోలీసులంతా బీహారీలే అని ఆమె దయ్యబట్టారు. తమకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని అరుణ స్పష్టం చేశారు. 

కాగా, మంత్రి హత్య కుట్ర కేసు డ్రామాకు సీఎం కేసీఆరే మూలం అని ఆమె ఆరోపించారు. మొదటి ముద్దాయిగా కేసీఆర్ ను, రెండవ ముద్దాయిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చేర్చాలని ఆమె డిమాండ్ చేసారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. నిందితుల ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ధ్వజమెత్తారు. 

 ఎఫ్ఐఆర్ లో అన్ని కట్టుకథలే పెట్టారని ఆమె మండిపడ్డారు.  నిందితులను అరెస్ట్ చేశారా? కిడ్నాప్ చేశారా? అనేది వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  పోలీసుల అదుపులో ఉన్నవారంతా.. ఒకప్పుడు మంత్రి శ్రీనివాస్ రెడ్డి అనుచరులేనని ఆమె స్పష్టం చేశారు. 

జితేందర్‌ రెడ్డి ఇంటిపై దాడి 

ఇలా ఉండగా, మాజీ ఎంపీ, బిజెపి నేత జితేందర్‌ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు  ఆయన నివాసంలోని కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు గేటు ముందు టైర్‌ను తగులబెట్టారు. దీనికి సంబంధించి సీసీటీవీ పుటేజీని జితేందర్‌రెడ్డి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఢిల్లీలోని తన నివాసంలో కిడ్నాప్‌ ఘటన అనంతరం మహబూబ్‌నగర్‌లో దుండగులు తన ఇంటిపై దాడిచేసి తన వ్యక్తిగత సిబ్బందిని బెదిరించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మహబూబ్‌నగర్‌ పోలీసులకు, డిజిపికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దుండగులపై డిజిపి, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక బీజేపీ నేతలున్నారనే ఆరోపణలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కుట్ర వెనుక ఉన్న అన్ని విషయాలను బయటపెడతామన్నారు. ఆరోపణలు ఎదుర్కోవడం బీజేపీకి కొత్త కాదని చెప్పారు. తప్పుడు కేసులు, ఆరోపణలతో కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. పాలమూరులో బీజేపీ నేతల ఇళ్లపై రాళ్ల దాడిపై మాట్లాడుతూ  ఆరోపణలతో  బీజేపీ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.