రాజధానిపై ప్రభుత్వంకు శాసనాధికారం లేదు!

మూడు రాజధానుల పేరుతో రాజధానిగా అమరావతి ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేడు రాష్ట్ర హైకోర్టులో తీవ్ర వ్యతిరేకత చెలరేగింది. రాజధాని మార్పు అంశంపై హైకోర్టును ఆశ్రయించిన రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ప్రభుత్వంకు ఆ విధంగా మార్చే శాసనాధికారం లేదని స్పష్టం చేసింది. 

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు మొత్తం 70 పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఒకింత జగన్ సర్కార్‌కు కోర్టు మొట్టికాయలేసింది. 

భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు తేల్చి చెప్పింది. ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని సర్కార్‌కు కోర్టు సూచించింది. అంతేకాదు మూడునెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం గడువు కూడా విధించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టత ఇచ్చింది. 

రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని జగన్ సర్కార్‌కు కోర్టు సూచించింది. మరోవైపు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. మాస్టర్‌ ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి చేయాల్సిందేనని కోర్టు సూచించింది.

ఇప్పటికే ప్రభుత్వం, రైతుల వాదనలు విన్న కోర్టు.. గురువారం నాడు కీలక తీర్పునే ఇచ్చింది. నిన్నటి నుంచి హైకోర్టు తీర్పుపై రాజధాని రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎప్పుడెప్పుడు వస్తుందా అని శిబిరాల్లో టీవీలు పెట్టుకుని మరీ రైతులు వేచి చూశారు. అయితే తీర్పు అనుకూలంగా రావడంతో శిబిరాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తీర్పు అనంతరం రైతు సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, అమరావతి భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని.. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి ఇవ్వొద్దని కూడా కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. పిటిషన్ల ఖర్చు కోసం రూ. 50 వేలు కూడా ఇవ్వాలని కోర్టు తెలిపింది. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. 

రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. ముందు నుంచి టీడీపీ మూడు రాజధానులు బిల్లు చెల్లదని చెబుతూనే ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, మూడు రాజధానులపై ముందుకు వెళ్ళిందని మండిపడ్డారు. 

హైకోర్టు తీర్పుతో నైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన హితవు పలికారు. హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని, మరో అప్పీల్‌కు వెళ్ళకూడదని కోరారు. హైకోర్టు చెప్పిన విధంగా రాజధాని భూములు అభివృద్ధి చేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి నాశనమైందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు.