శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర … బిజెపి నేతలపై ఫోకస్!

మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ హత్యకు కుట్ర జరిగిందని సైబరాబాద్‌‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అందుకోసం రూ.15 కోట్లకు సుపారీ డీల్ కుదిరినట్లు గుర్తించామని తెలిపారు. కుట్రదారునిగా పోలీసులు ఆరోపిస్తున్న రవి మంత్రి గత ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్ ను, ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ నుండి మార్చారని అంటి ఫిర్యాదు చేయడం గమనార్హం. 
 
కాగా, ఈ కేసులో బిజెపి సీనియర్ నేతలైన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణాలను `ఇరికించే’ ప్రయత్నం జరుగుతున్నట్లు ఆయన మాటలను బట్టి వెల్లడవుతుంది. 
 
ఈ కేసులో గత నెల 26న ముగ్గురిని అరెస్టు చేయగా, బుధవారం మరో ఐదుగురిని ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్​ క్వార్టర్స్​లో ఢిల్లీలో అరెస్టు చేశామని ఆయన పేర్కొన్నారు. వారి నుంచి 9 ఎంఎం రివాల్వర్, బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 
 
స్టీఫెన్ కధనం ప్రకారం మహబూబ్‌‌నగర్‌‌‌‌కు చెందిన చలువగ్‌‌ రాఘవేంద్ర రాజు అలియాస్‌‌ రఘు (47) రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌ గగన్‌‌పహాడ్‌‌కు చెందిన ఫారూఖ్‌‌తో కలిసి శ్రీనివాస్ గౌడ్‌‌ను హత్య చేసేందుకు కుట్ర చేశాడు. ఫారూఖ్‌‌ లేదా ఇంకెవరితోనైనా సరే హత్య చేయించాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం రూ.15 కోట్లు ఇస్తామని చెప్పాడు. 
 
ఇదే విషయాన్ని మహబూబ్‌‌నగర్‌‌‌‌ టీచర్స్ కాలనీకి చెందిన గోల్డ్‌‌ షాప్‌‌ ఓనర్ గులామ్‌‌ హైదర్‌‌ అలీకి ఫారూఖ్‌‌ చెప్పాడు. దీంతో హత్య కోణం బయటపడుతుందనే అనుమానంతో ఫారూఖ్‌‌, హైదర్ అలీని హత్య చేసేందుకు ముఠాలోని మిగతావాళ్లు ప్లాన్ చేశారు.
 
ఫారూఖ్, హైదర్ అలీ గత నెల 23న మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ కు వచ్చారు. సుచిత్ర వద్ద ఉన్న లాడ్జీలో షెల్టర్ తీసుకున్నారు. 25న లాడ్జీ నుంచి బయటకు వచ్చారు. అప్పుడు వారిపై మహబూబ్‌నగర్‌‌ జిల్లాకు చెందిన నాగరాజు, బండేకర్ విశ్వనాథ్ రావు, వర్ణ యాదయ్యలు కత్తులతో దాడికి ప్రయత్నించారు. 
 
ఫారూఖ్‌, హైదర్‌‌ అలీ తప్పించుకొని పేట్‌ బషీరా‌బాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 26న నాగరాజు, విశ్వనాథ్ రావు, యాదయ్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సీపీ వివరించారు. నాగరాజు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, అమరేందర్‌, మధుసూదన్‌ రాజు కలిసి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు కుట్ర పన్నినట్లు గుర్తించామని సీపీ తెలిపారు. 
 
‘‘నాగరాజు గ్యాంగ్‌ అరెస్టు విషయం తెలియగానే రాఘవేంద్రరాజు సహా ముగ్గురు నిందితులు మహబూబ్‌నగర్‌‌ నుంచి వైజాగ్‌, అక్కడి నుంచి ఢిల్లీకి పారిపోయారు. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో షెల్టర్ తీసుకున్నారు. జితేందర్‌‌ రెడ్డి పీఏ రాజు, డ్రైవర్ థాపా నిందితులకు షెల్టర్ ఇచ్చారు.” అని ఆయన చెప్పారు.
 
 మాజీ ఎంపీ జితేందర్‌‌రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుపుతామని స్టీఫెన్ వెల్లడించారు. శాస్త్రీయ సాక్షాధారాల ద్వారా డీకే అరుణతో పాటు మరెవరికైనా సంబంధాలు ఉన్నాయా? అనే వివరాలు రాబడతామని తెలిపారు. 
 
 మధుసూదన్ రాజు, అమరేందర్‌‌ ఇస్తామని చెప్పిన సుపారీ డబ్బు రూ.15 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. “హత్యకు ఎక్కడ ప్లాన్ చేశారనే వివరాలు రాబడతాం. ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నారనేది దర్యాప్తు చేస్తున్నాం” అని వివరించారు. 
కిడ్నప్ చేసింది పోలీసులే!
ఇలా ఉండగా, దేశ రాజధానిలో కలకలం రేపిన తెలంగాణాకు చెందిన మున్నూరు రవితో పాటు మరో ముగ్గురిని తెలంగాణ పోలీసులే తీసుకెళ్లినట్టు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.సౌత్ అవెన్యూలోని జితేందర్ రెడ్డి నివాసానికి సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మున్నూరు రవి, అతనితో వచ్చిన ఇద్దరితో పాటు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను తమ వెంట తీసుకెళ్లారు.

జితేందర్ రెడ్డి పీఏ జితేందర్ రాజ్ ఫిర్యాదు మేరకు మంగళవారం ఐపీసీ 365 కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పీఎస్‌లో మున్నూరు రవి సహా పలువురిపై కేసు నమోదైనట్టు తేలింది.

ఆ కేసులో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. అయితే జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను మాత్రం పొరపాటున అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మున్నూరు రవితో పాటు ముగ్గురి అరెస్టు అంశంపై ఢిల్లీ పోలీసులకు తెలంగాణా పోలీసులు సమాచారం ఇవ్వకపోవడంపై ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి.