ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 6000 మందిని తీసుకొచ్చాం

రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో మొత్తం 20,000 భారతీయలు చిక్కుకుపోగా వారిలో ఇప్పటి వరకు 6,000 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకురాడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ బుధవారం తెలిపారు. 
 
 ‘అక్కడ దాదాపు 20,000 మంది చిక్కుపడగా, వారిలో 4000 మందిని ఫిబ్రవరి 24 నాటికి తీసుకొచ్చాం. మరో 2000 మంది విద్యార్థులను మంగళవారం వరకు తీసుకొచ్చాం. ఇంకా చిక్కుకుపోయి ఉన్న వారిని కూడా తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
 
చిక్కుకుపోయిన వారి సంఖ్య పెద్ద సంఖ్యలో ఉన్నందున వారిని భారత్ తెచ్చేందుకు రక్షణ రంగానికి చెందిన విమానాన్ని ఉపయోగిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న రొమేనియా, పొలాండ్, హంగరీ, స్లోవేకియా వంటి దేశాల సహకారంతో విద్యార్థులను భారత్‌కు తరలిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. 
 
ఇదిలావుండగా ఉక్రెయిన్ నుంచి చిక్కుబడిన వారిని భారత్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ ఆరంభించింది. ‘ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆపరేషన్ గంగ పేరును ఉపయోగించుకున్నారు’ అని శివసేన ఆరోపించడంపై స్పందిస్తూ, ‘ఇది రాజకీయ అంశం కాదు, జాతీయ సమస్య’ అని స్పష్టం చేశారు. 
 
 ఇది భారతీయుల రక్షణకు సంబంధించిన విషయం. ఆపరేషన్ గంగ పేరుపై ఎలాంటి అభ్యంతరరం ఉండడానికి వీలులేదని హితవు చెప్పారు.
 
మరోవంక, ఉక్రెయిన్‌లోని రెండవ అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌పై రష్యా సైనిక దాడి ఉధృతం అవుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులందరూ నగరాన్ని విడిచి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇండియన్ ఎంబసీ బుధవారం హెచ్చరించింది. 
 
ఉక్రెయిన్‌కు తూర్పున ఉన్న ఖర్కీవ్ నగరంలోని నివసిస్తున్న భారతీయులందరూ తక్షణమే నగరాన్ని విడిచిపెట్టి బుధవారం సాయంత్రం 6 గంటల కల్లా పెసోచిన్, బబాయి లేదా బెజ్‌లియుదోవ్‌కా చేరుకోవాలని భారతీయ ఎంబసీ కోరింది. 
 
అయితే, ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో భారతీయ ఎంబసీ నుంచి ఈ హెచ్చరిక రావడం ఖర్కీవ్‌లోని భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. ఖర్కీవ్ రైల్వే స్టేషన్‌లో రైళ్లు ఎక్కకుండా తమను అడ్డుకుంటున్నారని పలువురు భారతీయ విద్యార్థులు మీడియాకు తెలిపారు. 
 
17,000 మంది ఉక్రెయిన్ సరిహద్దు దాటారు 
 
కాగా, ఉక్రెయిన్ వదిలిపెట్టి రావాలంటూ భారత ప్రభుత్వం జనవరి చేసిన సూచన మేరకు ఇప్పటి వరకు 17,000 మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దును దాటినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. సరిహద్దు దాటిన భారతీయులను వివిధ దేశాల నుంచి స్వదేశానికి తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 
 
‘‘ఉక్రెయిన్ సరిహద్దు దాటుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జనవరి చివర్లో భారత ప్రభుత్వం జారీ చేసిన సూచనల మేరకు ఉక్రెయిన్‌లోని భారతీయుల్లో ఇప్పటి వరకు 17,000 మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దు దాటారు. వారిని ప్రత్యేక విమానాల్లో భారత్ కు ప్రభుత్వం తరలిస్తోంది” అని తెలిపారు. 
 
ఉక్రెయిన్ సరిహద్దును ఫిబ్రవరి 24న మూసివేయడం వల్ల సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి, పొలాండ్ దేశాల నుంచి భారత్ కు  తరలిస్తున్నట్లు చెప్పారు.  ఇప్పటికే 15 విమానాల ద్వారా 3,352 మంది భారత విద్యార్థుల్ని ఇండియాకు తరలించారని, ఇందులో బుధవారమే  ఆరు విమానాలు భారత్ కు చేరాయని అరిందమ్ బాగ్చి తెలిపారు.
మరో 24 గంటల్లో మరో 15 విమానాల ద్వారా భారత విద్యార్థుల్ని స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపారు. ఆపరేషన్ గంగగా పిలుస్తున్న ఇందులో భారత ఎయిర్ ఫోర్స్ విమానాలు కూడా చేరాయి. ఇప్పటికే సీ-17 అనే విమానాన్ని బుచారెస్ట్ (రొమేనియా) నుంచి ప్రారంభించారు. మరో మూడు విమానాల్ని బుడాపెస్ట్ (హంగేరి), బుచారెస్ట్ (రొమేనియా), రెసో (పొలండ్)ల నుంచి నడపనున్నట్లు వివరించారు.

పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఇరువురు నేతలు ఉక్రెయిన్‌లో ముఖ్యంగా చాలామంది భారతీయులు చిక్కుపడిన ఖార్కివ్‌లో పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. 
 
దాడులు జరుగుతున్న ప్రాంతాల నుంచి భారతీయులను క్షేమంగా తీసు కువచ్చే విషయమై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారతీయులు ఘర్షణ జరుగుతున్న ప్రాంతాల నుండి బైటకు రావడానికి ఆరు గంటల పాటు కాల్పులు ఆపుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తున్నది. 
 
 ఇదిలా ఉండగా రాబోయే రెండు రోజుల్లో బుఖారెస్ట్‌నుంచి 3,500 మంది, సుసీవా నుంచి మరో 1300 మంది భారతీయులు స్వదేశానికి బయలుదేరుతారని కేం ద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.తాను గురువారం సిరెట్ సరిహద్దు ప్రాంతానికి వెళుతున్నానని, అక్కడినుంచి భారతీయు లందరినీ తరలించే దాకా తాను అక్కడే ఉంటానని, అక్కడినుంచి మొత్త భారతీ యులంతా క్షేమంగా వెళ్లే దాకా తాను అక్కడే ఉంటానని ఆయన తెలిపారు.