దూకుడుగా బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా!

వారం రోజులు దాటినా, అంతర్జాతీయంగా కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్న తలవంచని రష్యా మరింత దూకుడుగా ఉక్రెయిన్‌‌‌‌పై విరుచుకు పడుతూ భీకర యుద్ధం చేస్తున్నది. కీలకమైన రాజధాని కీవ్, రెండో పెద్ద సిటీ ఖార్కివ్‌‌‌‌లను చేజిక్కించుకునేందుకు భారీగా సైన్యాన్ని నడిపిస్తోంది. 

రోడ్డుపై ఒకటీ రెండు కాదు.. ఏకంగా 64 కిలోమీటర్ల మేర రష్యా మిలటరీ కాన్వాయ్‌‌‌‌ వరుస కట్టి.. ఉక్రెయిన్ రాజధాని వైపు దూసుకుపోతున్నది. దారిలో కనిపించిన ఇండ్లను కాలబెడుతున్నది. ప్రభుత్వ, మిలటరీ బిల్డింగులను టార్గెట్ చేసుకున్నది. ముందుగా మార్క్ చేసుకుని, టార్గెట్ ఫిక్స్ చేసుకుని, మిసైళ్ల వర్షం కురిపిస్తున్నది. 

మంగళవారం ఖార్కివ్‌‌‌‌లో జరిగిన మిసైల్ దాడిలో ఇండియన్ స్టూడెంట్‌‌‌‌ చనిపోయాడు. ఇప్పటిదాకా 14 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ చెప్పింది. వేలాది మంది పౌరులు కీవ్, ఇతర సిటీల్లో మెట్రోస్టేషన్లు, షెల్టర్లు, బేస్‌‌‌‌మెంట్లు, కారిడార్లలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. బుధవారం బెలారస్‌‌‌‌లో రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.

తీవ్రంగా ప్రతిఘటన 

అయితే ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌‌‌‌ దిశగా వస్తున్న రష్యన్ సైనికులను ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. మొన్నటి నుంచి రష్యాకు వరుసగా ఓటములు ఎదురుకావడంతో.. నెత్తుటి విజయం సాధించేందుకు మధ్య యుగం నాటి వ్యూహాలను పుతిన్ ఉపయోగిస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపించింది. 

సిరియాలో చేసినట్లుగా.. ఇక్కడ కీవ్ నగరాన్ని చుట్టుముట్టి, బాంబు దాడులు చేయాలని భావిస్తున్నదని చెప్పింది. ‘‘ప్రధాన నగరాలకు జరిగే సరఫరాలను ఆపేసి, ఆహార సంక్షోభం సృష్టించేందుకు రష్యన్ దళాలు ప్రయత్నించవచ్చు. ఇప్పటికే కీవ్‌‌‌‌లోని సూపర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఆహారం అందుబాటులో ఉండేలా చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం రంగంలోకి దిగాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్‌‌‌‌లో ఉక్రెయిన్ అంబాసిడర్ వాదిమ్ ప్రిస్టయ్‌‌‌‌కో చెప్పారు.

 ముట్టడి వ్యూహాలను రష్యా ఇప్పటికే మరియుపోల్‌‌‌‌లో అమలు చేస్తోంది. స్కూళ్లు, ఇండ్లతోపాటు పౌరులు ఉన్న అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఫిరంగుల ద్వారా నిరంతరం షెల్లింగ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పిల్లలు సహా ఎంతో మంది చనిపోయారు. ఈ సిటీకి ఇప్పటికే పవర్ కట్ చేశారు. 

మరియుపోల్‌‌‌‌ ప్రస్తుతం ఉక్రెయిన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌లోనే ఉంది. ఖెర్సన్ సిటీలోనూ ఇలానే రష్యా దాడులు చేస్తున్నది. శివార్లలో ప్రజలు ఉన్న బిల్డింగులపై మిసైల్ దాడులు జరుగుతున్నాయి. వీధుల గుండా దళాలు లోనికి చొచ్చుకెళ్తున్నాయి.

 పుతిన్ పై యుద్ధ నేరాల ఆరోపణల దర్యాప్తు!

ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై  ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ దర్యాప్తునకు సిద్ధమైంది.   బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  పార్లమెంటులో మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఒక యుద్ధ నేరస్తుడని అని మండిపడ్డాయిరు. పుతిన్ నాయకత్వంలోని రష్యా ఉక్రెయిన్ లో ఇప్పటికే పలు యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. 

అమాయక ప్రజలపై  బాంబులు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దర్యాప్తునకు అన్ని బ్రిటన్ చట్టసభల సభ్యులందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.  ఉక్రెయిన్ లో రష్యా ముమ్మాటికీ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆయన స్పష్టం చేశారు.

పుతిన్ నేరాలను అందరూ చూశారని పేర్కొంటూ అవి కచ్చితంగా యుద్ధ నేరాలే అవుతాయని చెప్పారు. క్రిమినల్ న్యాయస్థానం ప్రాసిక్యూటర్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి ఉంటారని తెలిపారు. బ్రిటన్ రాజకీయ పక్షాలన్నీ మద్దతిస్తాయని భావిస్తున్నాను అని  బోరిస్ జాన్సన్ చెప్పారు.

కాగా రష్యా చేపడుతున్న సైనిక చర్యను ఉక్రెయిన్ గట్టిగానే తిప్పికొడుతోంది. ఇప్పటివరకు 6 వేల మంది రష్యన్లు హతమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మరో వైపు రష్యన్ సైనికుల మానసిక స్థైర్యం పడిపోతోందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ప్రకటించారు.

‘పరిణామాలు మారిపోతున్నాయి. వారి సైన్యంలో మానసిక ధైర్యం నింపేందుకు రష్యా దురాక్రమణ దారులు ప్రయత్నిస్తున్నారు. అది దిగజారిపోతోంది. ఇది అనేక సార్లు రుజువవుతోంది. ఉక్రెయిన్‌తో ప్రత్యక్షంగా తలపడేందుకు శత్రువు భయపడుతోంది. అందుకే ప్రశాంతంగా ఉండే నగరాలపై షెల్లింగ్ జరుపుతూ నేరాలకు పాల్పడుతోంది’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.