ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి

భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశంకు తరలించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక వంక ప్రయత్నం చేస్తుండగా, అక్కడ మరో భారతీయ విద్యార్థి బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్ లోని బార్నాలకు చెందిన  చందన్ జిందాల్ (22)  ప్రాణాలు కోల్పోయారు.
వినిట్సియాలోని నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ప్రాణాలు కోల్పోయిన మొదటి విద్యార్థి కర్ణాటకకు చెందిన నవీన్ అనే సంగతి తెలిసిందే.  ఇషెమిక్ స్ట్రోక్‌తో బాధపడుతున్న జిందాల్‌ను వినిట్సియాలోని కీవ్‌స్కా వీథి-68లో ఉన్న ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు.
ఆయన తండ్రి భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో తమ కుమారుని మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయాలని కోరారు.  కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప మంగళవారం ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో జరిగిన పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధం అమలవుతోంది. కాబట్టి మృతదేహాలను తీసుకురావడానికి ఇతర మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది.  ఇషెమిక్ స్ట్రోక్ వచ్చినపుడు మెదడుకు ఆక్సిజన్, న్యూట్రియెంట్స్ సక్రమంగా అందవు. క్షణాల్లోనే బ్రెయిన్ సెల్స్ మరణిస్తాయి. దీనికి సరైన, అత్యవసర చికిత్స తప్పనిసరి. సాధ్యమైనంత త్వరగా చికిత్స అందితే మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు.
మానవతా కారిడార్ కు రష్యా సంసిద్ధత 
ఉక్రెయిన్‌లో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా ‘మానవతా కారిడార్’ (హ్యుమనటేరియన్ కారిడార్) ఏర్పాటు చేసేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ నుంచి రష్యాకు చేర్చి అక్కడి నుంచి భారత్‌కు పంపనుంది. 
 
ఇందుకోసం శీఘ్ర చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. భారతీయుల భద్రతాంశంపై ఆ దేశంతో రష్యా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ‘సేఫ్ పాసేజ్’కు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 
 
ఉక్రెయిన్ సంక్షోభంతో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన కారణంగా ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్‌కు సరఫరా చేసే విషయంలో అవరోధాలు తలెచ్చే అవకాశాలపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, అలాంటిదేమీ ఉంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. 
 
రష్యా ఆయుధాలపై ఆధారపడినందు వల్ల కాకుండా ఉక్రెయిన్‌లో పరిస్థితిని అంచనా వేసే భారత్ ‘నిష్పాక్షిక’ వైఖరి ప్రదర్శించిందని అలిపోవ్ ప్రశంసించారు.
 
 సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు
 
యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలి పెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోన్‌భద్ర జిల్లాలో బుధవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తెస్తున్నామని చెప్పారు. 
 
వేలాది మందిని ఇప్పటికే భారత్‌తు తీసుకువచ్చామని చెబుతూ తాము చేపట్టిన ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు నలుగురు మంత్రులను కూడా అక్కడకు పంపామని గుర్తు చేశారు. భారతీయులను సురక్షితంగా తెచ్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదలిపెట్టేది లేదని పేర్కొన్నారు. భారత్  బలం పెరుగుతున్నందున్నే మనం ఇలాంటి సురక్షిత చర్చలు తీసుకోగలుగుతున్నామని ప్రధాని తెలిపారు.