మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. ఓ డ్రామా

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రలో తన హస్తం ఉందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ,  మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అనేది సీఎం కేసీఆర్ ఆడుతున్న ఓ పెద్ద డ్రామా అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కొట్టిపారేశారు. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతోందని, ఆయన ఎక్కడ కాలు మోపితే అక్కడ విజయం వరిస్తుందని పేర్కొన్నారు. 

అందుకే ఆయన త్వరలో చేపట్టబోయే రెండో విడత పాదయాత్రను ఆపడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జిగా ఉండి.. బీజేపీని గెలిపించానని నమ్మిన పార్టీ తనకు మిషన్ 19 బాధ్యత అప్పగించిందని పేర్కొన్నారు. అందుకే తనపై ఎలాగైనా బురద జల్లాలని కేసీఆర్ ఈ హత్యా  డ్రామాకు తెరదీశారని ఆరోపించారు. 

తాను అందరితో సఖ్యతగా ఉంటానని, అందుకే తనను అందరూ ఆల్ పార్టీ జితేందర్ అంటారని గుర్తు చేశారు. అలాంటి తనపై హత్యారోపణలు చేయడం సరికాదని కేసీఆర్ కు హితవు చెప్పారు. మచ్చలేని తనపై ఆరోపణలు సరికాదని తెలిపారు. 

పథకం ప్రకారమే దుండగలు తన ఇంటిపై  రాళ్లతో దాడి చేశారని, దాడిని ఆపాల్సిన పోలీసులు టీఆర్ఎస్ సర్కార్ కు తొత్తులుగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఢిల్లీలో ఉన్న సమయాల్లో పాలమూరు నుంచి వచ్చే ప్రతి ఉద్యమకారుడికి ఆశ్రయమిస్తుంటానని చెబుతూ  కేసీఆర్‌ లాగా ఉద్యమద్రోహులను పక్కన చేరదీసుకునే వ్యక్తిని కాదని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ ఉద్యమకారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గతనెల 26వ తేదీన టీఆర్‌ఎస్‌ నాయకుడు మున్నూరు రవి వ్యక్తిగత పనిమీద ఢిల్లీకి వస్తే పీఏ ద్వారా వసతి కోరితే వసతి కల్పించానని, అతడు తిరిగి 28వ తేదీన వెళ్లిపోయాడని జితేందర్‌రెడ్డి తెలిపారు

కేసీఆర్ కు డబ్బు, అధికారం మీద దాహమే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టదని మండిపడ్డాయిరు. తన డ్రైవర్ ఏ తప్పు చేయలేదని, అతడిపై పెట్టిన కేసును వెంటనే ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఢిల్లీ పోలీసులు సీరియస్ 

ఇలా ఉండగా, తెలంగాణ పోలీసుల వైఖరిపై ఢిల్లీ పోలీసు యంత్రాంగం సీరియ్‌సగా ఉంది. నాలుగు  రోజుల క్రితం ఢిల్లీలోని సౌత్‌ అవెన్యూలో ఉన్న బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసం నుంచి పాలమూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు, జితేందర్‌ వ్యక్తిగత డ్రైవర్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత   వారితో పాటు మరికొంత మంది కలిసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని సైబరాబాద్‌ పోలీస్ కమీషనర్ స్టెఫిన్  ప్రకటించారు. 

అయితే, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇలా వ్యక్తులను అరెస్టు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయమై తెలంగాణ పోలీసులకు ఘాటైన లేఖ రాయబోతున్నామని ఢిల్లీ పోలీసు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

కాగా, ఓ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన వ్యక్తిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకొని.. రాష్ట్రానికి తరలించారు. దాంతో సదరు వ్యక్తి కుటుంబీకులు ఢిల్లీ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేయగా… విచారణ నేపథ్యంలో న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని విస్మరించొద్దని సూచించింది. తాజాగా అదే రీతిలో మరో ఘటన జరగడాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.