ఉక్రెయిన్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత… వేలాది మందికి ముప్పు 

రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కు కొరత ఏర్పడింది. కొన్ని ఆస్పత్రుల్లో ఇప్పటికే ఆక్సిజన్ అయిపోగా, మరికొన్ని ఆస్పత్రుల్లో 24 గంటల్లో అయిపోనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తెలిపింది. దీంతో వేలాది మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది.
 
 ‘‘ఉక్రెయిన్లో మెడికల్ ఆక్సిజన్ అయిపోతంది. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ప్లాంట్ల నుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్ సప్లై కావడంలేదు. కొన్ని ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. ఉత్పత్తికి అవసరమైన జియోలైట్ రవాణా నిలిచిపోవడమే ఇందుకు కారణం” అని చెప్పింది.
 
విద్యుత్ కొరత కారణంగానూ ఆస్పత్రుల్లో సేవలపై ప్రభావం పడుతోందంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్కు సాయం చేస్తున్నట్లు పేర్కొంది.

మరోవంక, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు రోజురోజుకు తీవ్రమవుతూ ఉండడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఉక్రెయిన్‌నుంచి యూరోపియన్ యూనియన్ తూర్పు వైపునకు శరణార్థుల వలసలు భారీ ఎత్తున కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు ఆ దేశంనుంచి 5 లక్షల మందికి పైగా ఇప్పటికే పొరుగు దేశాలకు పారిపోయినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. 

ఉక్రెయిన్ నుంచి తరలి వచ్చే వారి కార్లు, బస్సులతో పోలాండ్, హంగరీ, స్లోవేకియా, రొమేనియా, మోల్డావియా సరిహద్దుల్లోని చెక్‌పాయింట్లు నిండి పోయాయి. వేలాది మంది కాలి నడకన తమ సామానులను లాక్కుంటూ సరిహద్దులను దాటి యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి అడుగుపెడుతున్నారు.

హంగరీ సరిహద్దు గ్రామమైన బెరెగ్‌సురానీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రిసిప్షన్ సెంటర్ వద్ద వందలాది మంది ట్రాన్సిట్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకోసం రవాణా సదుపాయం కోసం ఎదురు చూస్తూ ఉండడం కనిపించింది. అక్కడినుంచి హంగరీలోకి, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వారికి వీలు కలుగుతుంది. కాగా ఇక్కడికి చేరుకున్న వారిలో ఎక్కువ మంది భారత్, ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. 

కాగా, ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి ఏడవ రోజుకు చేరుకుంది. రష్యా సేనల దాడులతో కైవ్ తోపాటు పలు నగరాల్లో అట్టుడికుతున్నాయి.రష్యా సైనికులు ఖార్కివ్ లో దిగి స్థానిక ఆసుపత్రిపై దాడి చేశాయి.ఖార్కివ్‌లో రష్యా దళాలు, ఉక్రేనియన్ సైనికుల మధ్య పోరు జరుగుతోంది.
 
ధైర్యవంతులైన ఉక్రేనియన్ పౌరులు రష్యా దాడి దూకుడును తగ్గించడానికి శత్రు ట్యాంకుల పైకి ఎక్కారు.7వ రోజున రష్యా దాడిని తీవ్రతరం చేయడంతో ఉక్రెయిన్ అత్యవసర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వాట్సాప్‌లో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.
ఇలా ఉండగా, యుద్ధం మొదలయ్యాక సైనిక స్థావరాలు, ఎయిర్‌‌‌‌‌‌‌‌ స్ట్రిప్‌‌‌‌, బారక్‌‌‌‌లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసింది. తొలి మూడు నాలుగు రోజులు ఇలానే నడిచింది. కీవ్‌‌‌‌లోకి చిన్న గ్రూపులను పంపింది. కానీ ఉక్రెయిన్ ఎంతకీ లొంగకపోవడంతో ఇప్పుడు దాడులను విస్తరించింది. నగరాల్లో ఇండ్లపై బాంబులు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. పెద్ద సంఖ్యలో దళాలను కీవ్, ఖార్కివ్ దిశగా నడిపిస్తోంది. 
 
చాలా ప్రాంతాల్లో ప్రజల ఇండ్ల మధ్య ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఇండ్లను కూడా బాంబులు తాకుతున్నాయి. సైనికులు భారీగా రోడ్డు మార్గంలో వెళ్తుండటంతో.. ఇకపై గగనతలం నుంచి జరిగే దాడులు తగ్గిపోయే అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి కీవ్‌‌‌‌ ను చుట్టుముట్టి స్వాధీనం చేసుకునేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది.