నాటి కమెడియన్… నేడు యుద్ధభూమిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు

సినిమాల్లో స్టార్ కామెడీ యాక్టర్ అతడు. తన కామెడీ పంచులతో ఫ్యాన్స్‎ను కడుపుబ్బా నవ్వించేవాడు. నటుడిగా ఎన్నో అవార్డులు.. మరెన్నో రివార్డులు అందుకున్నాడు. ఇదంతా ఒకప్పుడు. కానీ, ఇప్పుడు అతను ఓ రియల్ హీరో. ప్రపంచం మొత్తం అతడి సాహసానికి ఫిదా అవుతోంది. 

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటైన రష్యా.. తమ దేశంపై దాడులకు పాల్పడుతుంటే ఏమాత్రం భయపడకుండా శత్రు దేశానికి చుక్కలు చూపిస్తున్నాడు. తన సైన్యాన్ని బాహుబలిలా ముందుండి నడిపిస్తున్నాడు. ప్రత్యర్థి దేశం ఎన్ని రకాలుగా భయపెట్టిన ‘తగ్గేదేలే’ అంటున్న ఆ వ్యక్తే ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ.

గత ఏడాది ఆఫ్ఘానిస్తాన్ లో చూసాము. బలమైన సైన్యం ఉన్నప్పటిది తాలిబన్లు కాబుల్ చేరుకోబోతున్నారు అనగానే దేశ అధ్యక్షుడు మరో దేశానికి పారిపోయాడు. సైన్యంలో అనుభవం ఉన్న ఉపాధ్యక్షుడు సహితం పలాయనం చిత్తగించారు. `నాటకలవాడు’ అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎద్దేవా చేస్తున్న జెలెన్స్కీని సురక్షిత ప్రదేశాలకు చేర్చడానికి అమెరికా వంటి దేశాలు ముందుకు వచ్చాయి.

కానీ దేశంలో, సైనికులు – ప్రజల మధ్యలో ఉంది స్వయంగా ప్రతిఘటన పోరాటానికి నేతృత్వం వహిస్తున్నారు. బహుశా మరే ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటి వరకు ఈ విధంగా జరిగి ఉండదు. “రష్యా మొదటి లక్ష్యం నన్ను, ఆ తర్వాత నా కుటుంబాన్ని చంపటమే. ప్రాణం ఉన్నంతవరకు పోరాడతాను” అంటూ ప్రకటనలు చేస్తున్నాడు. ఎటువంటి రాజకీయ, సైనిక నేపధ్యం లేకుండానే దేశ అధ్యక్ష పదవి చేపట్టి, యుద్ధ భూమిలో ప్రపంచంలోనే ఒక పెద్ద సైన్యంతో పోరాడుతున్నాడు.

జెలెన్స్కీ అసలు పేరు వొలొదిమిర్ ఒలెక్సాండ్రోవిచ్ జెలెన్స్కీ. ఈయన జనవరి 25, 1978న క్రివీ రిహ్‌లో ఒలెక్సాండర్ జెలెన్స్కీ, రిమ్మా జెలెన్స్కీ దంపతులకు జన్మించాడు. జెలెన్స్కీ తన ప్రాథమిక విద్యను ప్రారంభించడానికి ముందు .. తండ్రి ఉద్యోగ రిత్యా మంగోలియాలోని ఎర్డెనెట్‌లో నాలుగు సంవత్సరాలు ఉన్నాడు.

జెలెన్స్కీ 16 సంవత్సరాల వయస్సులో విదేశీ భాషగా ఇంగ్లీషు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఇజ్రాయెల్‌లో చదువుకోవడానికి గ్రాంట్ కూడా సాధించాడు. కానీ జెలెన్స్కీ తండ్రి అందుకు ఒప్పుకోలేదు. అనంతరం ఆయన క్రివీ రిహ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి లా పట్టా పొందారు.

టివి నటుడిగా ప్రారంభం 

జెలెన్‌స్కీకి మొదటినుంచి నటనపై ఆసక్తి ఉండేది. దాంతో ఆయన తన 17వ ఏట రష్యన్ టీవీలో ప్రసారమయ్యే కేవీఎన్ అనే టీవీ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే కేవీఎన్ లో కీలక పాత్రం పొషిస్తున్న ఉక్రెనియన్ టీంలో చేరారు.

 2003లో తన కామెడీ బృందం పేరు మీద ‘క్వార్టల్ 95’ అనే టీవీ నిర్మాణ సంస్థను భాగస్వాములతో కలిసి స్థాపించారు. ఉక్రెయినియన్ టీవీ చానెల్ 1+1 కోసం ఈ సంస్థ కార్యక్రమాలను రూపొందించింది.

జెలెన్‌స్కీ తన సినీ జీవితాన్ని 2008లో ‘లవ్ ఇన్ ద బిగ్ సిటీ’తో ప్రారంభించారు. ఆ తర్వాత లవ్ ఇన్ ద బిగ్ సిటీ2, ఆఫీస్ రొమాన్స్, అవర్ టైం, రెవ్స్కీ వర్సెస్ నెపోలియన్, లవ్ ఇన్ ద బిగ్ సిటీ3 తదితర సినిమాలలో నటించాడు. 

 
ఓ వైపు సినిమాలలో నటిస్తూనే ‘ఇంటర్’ అనే టీవీ చానెల్ కు 2010 నుంచి 2012 వరకు బోర్డ్ మెంబర్‎గా కూడా పనిచేశాడు. జెలెన్‌స్కీ 2015లో ‘సర్వెంట్ ఆఫ్ ది పీపుల్’ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ సినిమాలో ఆయన యాధృచ్చికంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పాత్రలో నటించాడు. 
 
సినిమా పేరుతో పార్టీ 
 
ఈ సినిమాలో జెలెన్‌స్కీ హిస్టరీ ప్రొఫెసర్ పాత్ర పొషిస్తూ.. అవినీతికి వ్యతిరేకంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫేమస్ అయ్యారు. జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నటించిన ‘సర్వెంట్ ఆఫ్ ది పీపుల్’ సినిమానే ఆయన పార్టీ పేరుగా మారింది.
ఈ పేరుతో జెలెన్‌స్కీ తన ప్రొడక్షన్ కంపెనీ ప్రతినిధులతో కలిసి పార్టీని స్థాపించాడు. అనంతరం 2019లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు. రాజకీయ నాయకులపై నమ్మకాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నట్లు తెలిపాడు.
అంతేకాకుండా.. వృత్తిపరమైన, మంచి వ్యక్తులను అధికారంలోకి తీసుకురావాలని.. అందుకోసం రాజకీయాలలో నెలకొన్న గందరగోళాన్ని వీలైనంత వరకు మార్చాలనుకుంటున్నానని ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.
 
ఆయన తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టడానికి ఆరు నెలల ముందే ఒపినీయన్ పోల్స్ లో అధ్యక్ష పదవికి రన్నర్ గా నిలిచాడు. అనంతరం 2019 న్యూ ఇయర్ వేడుకల్లో రాజకీయాల్లోకి రాజోతున్నట్లు ప్రకటించాడు. తాను కేవలం ఒక పర్యాయం మాత్రమే పదవిలో ఉంటానని ముందుగానే ప్రకటించాడు.  
 
కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్ ను మాత్రమే వాడుకొని ఎన్నికల్లో విజయం సాధించారు. కేవలం రెండు నుంచి మూడు నెలల్లోనే అప్పటి ప్రెసిడెంట్ పెట్రో పోరోషెంకోను పదవీచిత్యుడిగా చేశారు.  ఆ ఎన్నికల్లో జెలెన్‌స్కీ  73.2 శాతం ఓట్లతో అత్యధిక మెజారిటీ సాధించగా.. మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో కేవలం 25 శాతం ఓట్లు మాత్రమే సాధించాడు. దాంతో ఆయన  2019 మే 20న ఉక్రెయిన్ ఆరవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.