ఉక్రెయిన్ సంక్షోభం… మోదీకి మమతా మద్దతు 

ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఆమె సోమవారం ఓ లేఖలో తెలిపారు. 

దేశ గౌరవాన్ని ఎవరూ సవాలు చేయలేరని, ఆ గౌరవాన్ని కాపాడేందుకు ఈ లేఖ రాస్తున్నట్టు ఆమె చెప్పారు. సహకార వ్యవస్థలో ఉన్న ఓ సీనియర్ ముఖ్యమంత్రిగా , ఓ జాతీయ పార్టీ నేతగా, ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మన దేశ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు మమత ఆ లేఖలో తెలిపారు. 

 “ఉక్రెయిన్‌‌లో చిక్కుకుపోయిన భారతీయులను, ముఖ్యంగా విద్యార్థులను వెంటనే స్వదేశానికి రప్పించడంపై మరిన్ని తక్షణ చర్యలు అవసరం. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్.. శాంతివైపుకు ప్రపంచాన్ని ముందుకు నడిపే బాధ్యత తీసుకోవాలి” అని ఆమె సూచించారు. 

అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభం ఏర్పడిందని, ఈ సమయంలో స్వదేశీయంగా ఉన్న విభేదాలను పక్కన పెట్టాలని, ఓ దేశంగా ఐక్యత చాటాలని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన విదేశీ వ్యవహార సూత్రాలు ఏ రకంగా దెబ్బతినవద్దని ఆమె అభిప్రాయపడ్డారు. 

స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి అంతర్జాతీయ శాంతికి భారత్ కట్టుబడి ఉందని తెలుపుతూ దురాక్రమణ, సరిహద్దు ఉల్లంఘనలు సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సమయంలో దౌత్యవ్యవహారాలను సరైన రీతిలో అమలు చేస్తారని ఆశిస్తున్నట్టు దీదీ తన లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.