గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాని లీగల్ నోటీసులు

గుజరాత్‌లో జరిగిన రూ. 500 కోట్ల కుంభకోణంలో తన పాత్ర ఉన్నట్లు ఆరోపించిన అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌రాం రథ్వా, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై లీగల్ నోటీసులు పంపినట్లు మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని  తెలిపారు. 
 
రెండు గ్రామాలలోని భూములను రాజ్‌కోట్ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి మార్చేందుకు జరిగిన రూ. 500 కోట్ల కుంభకోణంలో రూపానికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు రథ్వాతోపాటు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. 
 
ఆదివారం అమెరికా నుంచి రాగానే ఈ విషయాన్ని తన న్యాయవాదితో చర్చించానని, 15 రోజుల్లోగా తనకు క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం కేసును ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తూ రథ్వాతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిజె చావ్డా, శైలేష్ పర్మర్‌కు లీగల్ నోటీసులు పంపించానని రూపానీ తెలిపారు. 
 
తనను అప్రదిష్ట పాల్జేయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రను తేలికగా తీసుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.