సంక్షోభంలో రాజకీయాలు వద్దు

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించే ప్రక్రియను ఎవరూ రాజకీయం చేయవద్దని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి.దేవెగౌడ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వరుస ట్వీట్లలో పార్టీలను కోరారు.
”ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమను కాపాడాలంటూ మన విద్యార్థులు పదేపదే విజ్ఞప్తులు చేస్తున్న వీడియోలు చూశాను. వారి పరిస్థితి చూస్తే హృదయం ద్రవించుకుపోతోంది. సురక్షితంగా స్వదేశానికి చేరాలనుకుంటున్న వారి డిప్రెషన్‌ను నేను అర్ధం చేసుకోగలను” అని చెప్పారు.
యుద్ధం చెలరేగిన దేశంలో నిశ్చయంగా కొంత అనిశ్చితి ఉంటుందని, ఆపరేషన్ లింక్స్ తెగిపోతాయని తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న మన అధికారులు, కార్యాలయాలు దానిపై పూర్తి దృష్టి సారిస్తుంటాయని భరోసా వ్యక్తం చేశారు. వారికి మనం బాసటగా నిలవాలని దేవెగౌడ విజ్ఞప్తి చేశారు.
వేరే దేశంలో చిక్కుకున్న వారిని తరలించే ప్రక్రియ చాలా సున్నితమైన అంశమని, ఆ ప్రక్రియను ఎంతమాత్రం రాజకీయం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఇందువల్ల ఆ ఆపరేషన్ నైతికస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుందనని హెచ్చరించారు.  ఇలాంటి సందర్భాల్లో పైచేయి సాధించాలనుకోవడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. అంతా కలిసికట్టుగా పనిచేద్దామని మరో ట్వీట్‌లో దేవెగౌడ కోరారు.