దేశాభివృద్ధిలో ‘పీఎం గతిశక్తి’ కీలకం

దేశాభివృద్ధిలో ‘పీఎం గతిశక్తి’ కీలకపాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సమన్వయం, పర్యవేక్షణ ద్వారా మెరుగైన మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇది ప్రాజెక్టుల వ్యయాన్ని, సమయాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు. 

కార్పొరేట్‌ సంస్థలు ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని, పెట్టుబడులు పెంచి దేశాభివృద్ధికి సహకరించాలని ప్రధాని పిలుపిచ్చారు. ‘పీఎం గతిశక్తి’పై సోమవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి గతిశక్తి పథకం కొత్తగా దిశానిర్దేశం చేస్తుందని భరోసా ఇచ్చారు. 

మౌలిక సదుపాయాల ప్రణాళిక నుంచి అభివృద్ధి, వినియోగ దశ వరకూ నిజమైన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఈ పథకం నిర్ధారిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధి వేగాన్ని ఈ ఏడాది బడ్జెట్‌ నిర్దేశించిందని, మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధికి సంబంధించిన ఈ దశ మన దేశ ఆర్థిక వ్యవస్థ అసాధారణ పెరుగుదలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. 

దీనివల్ల అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వివిధ శాఖల మధ్య స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల సంప్రదాయ పద్ధతుల్లో ప్రాజెక్టులను పూర్తి చేసేటప్పుడు సమన్వయ లోపం చోటుచేసుకుంటోందని గుర్తు చేశ రు. అయితే పీఎం గతిశక్తి దేశంలోని వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. 

భారత్‌ను మరింత బలోపేతం చేయాలి 
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని భారత్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.  ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌, బల్లియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో ఆయన ప్రసంగీస్తూ పెద్ద రాష్ట్రం అయినందున, దేశాన్ని శక్తిమంతం చేయడంలో యూపీపై గొప్ప బాధ్యత ఉందని చెప్పారు.  దేశ సరిహద్దుల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘‘వైబ్రెంట్‌ విలేజ్‌’’ పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని ప్రధాని చెప్పారు.

కాగా.. యూపీలో అధికారంలో ఉన్న సమయంలో ఎస్పీ, బీఎస్పీలు కులాల ప్రాతిపదికగా పనిచేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించారు. బీజేపీ మాత్రం 2017 నుంచి అన్ని వర్గాల వారికోసం పనిచేసిందని చెప్పారు. ఖుషీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే బాలికలకు ఉచితంగా స్కూటర్లు ఇస్తామని, ఉన్నత విద్య చదివే పేద యువతకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు ఇస్తామని, ఐదేళ్ల పాటు రైతులు కరెంటు బిల్లులు చెల్లించొద్దని లేదని షా చెప్పారు.