ఉక్రెయిన్ సంక్షోభంపై దలైలామా ఆందోళన

టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా సోమవారం ఉక్రెయిన్ సంక్షోభంపై ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు, విభేదాలను చర్చల ద్వారా ఉత్తమంగా పరిష్కరించుకోవచ్చని ఆయన హితం చెప్పారు.
యుద్ధం పాతది, అహింస మాత్రమే మార్గమని నోబెల్ శాంతి బహుమతి విజేత ఉక్రెయిన్‌లో రష్యా దాడిపై స్పష్టం చేశారు.

ధర్మశాలలో విడుదల చేసిన ఒక ప్రకటనలో, “ఉక్రెయిన్‌లో జరిగిన సంఘర్షణ పట్ల నేను చాలా బాధపడ్డాను. మన ప్రపంచం చాలా పరస్పర ఆధారితంగా మారింది.  రెండు దేశాల మధ్య హింసాత్మక వివాదం అనివార్యంగా మిగిలిన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది” అని హెచ్చరించారు. 

 
“యుద్ధం పాతది, అహింస ఒకే మార్గం. ఇతర మానవులను సోదరులు,  సోదరీమణులుగా పరిగణించడం ద్వారా మనం మానవత్వపు ఏకత్వ భావాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధంగా మనం మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మిస్తాము” అని పిలుపిచ్చారు.

“సమస్యలు , విభేదాలు చర్చల ద్వారా ఉత్తమంగా పరిష్కరించబడతాయి. పరస్పర అవగాహన ,పరస్పర శ్రేయస్సు పట్ల గౌరవం ద్వారా నిజమైన శాంతి ఏర్పడుతుంది” అని దలైలామా చెప్పారు.

ఉక్రెయిన్‌లో శాంతి త్వరితగతిన పునరుద్ధరించబడుతుందని ఆశిస్తూ, “మనం ఆశను కోల్పోకూడదు. 20వ శతాబ్దం యుద్ధం,  రక్తపాతం శతాబ్దం కాగా, 21వ శతాబ్దం సంభాషణల శతాబ్దంగా ఉండాలి” అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.